- రెడీ చేస్తున్న ఫారెస్ట్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు
- ప్రాణహిత వైల్డ్ లైఫ్ ప్రొటెక్టెడ్ఏరియా బయట 3వేల హెక్టార్లు
- మూడు వేల హెక్టార్ల ఫారెస్ట్ ఏరియా కేటాయింపు
- సస్టైనబుల్ మెథడ్‌లో పట్టు రైతులకు ఉపాధి
- ఇప్పటికే చెన్నూర్ పట్టుకు దేశవ్యాప్త గుర్తింపు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రాంతం టస్సర్(దసలి పట్టుగూళ్లు) ఉత్పత్తికి పెట్టింది పేరు. చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో దాదాపు 7వేల ఎకరాల్లో ఆదివాసీ గిరిజన రైతులు పట్టుగూళ్లను సాగు చేస్తున్నారు. ఇందులో ఏదులబంధం, లింగన్నపేట, రాజారం, పారుపల్లి, కొత్తపల్లి అటవీ ప్రాంతం ప్రాణహిత వైల్డ్‌లైఫ్ సాంక్చురీ ప్రొటెక్టెడ్ జోన్ పరిధిలో ఉండడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈసారి పర్మిషన్ఇవ్వలేదు. దీంతో పట్టు రైతులు ఉపాధి కోల్పోకుండా చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి జి.వివేక్ వెంకటస్వామి చర్యలు చేపట్టారు.
పట్టు రైతులకు ప్రత్యామ్నాయంగా ఫారెస్ట్ ఏరియా కేటాయించాలని ఆర్డర్స్జారీ చేశారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ప్రొటెక్టెడ్ జోన్ వెలుపల ఫారెస్ట్ఏరియా కేటాయించేందుకు సర్వేలు చేస్తున్నారు. సెరీకల్చర్ అధికారులతో కలిసి మైక్రో ప్లాన్ రెడీ చేస్తున్నారు. మూడు రేంజ్‌ల పరిధిలో సుమారు 3వేల హెక్టార్ల ఏరియాను అప్పగించనున్నట్టు అధికారులు తెలిపారు. తద్వారా దసలి పట్టు రైతులు వారికి కేటాయించిన ప్రాంతాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పట్టుగూళ్లు సాగు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.
తెలంగాణలో 50 శాతం దిగుబడి ఇక్కడే..
దసలి పట్టుగూళ్ల ఉత్పత్తిలో చెన్నూర్ ప్రాంతం రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది. తెలంగాణలో ఉత్పత్తయ్యే టస్సర్లో దాదాపు 50 శాతం దిగుబడి ఇక్కడే వస్తోంది. జిల్లాలో సాగైన పట్టుగూళ్లు మంచి క్వాలిటీ ఉండడంతో దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ఏటా ఇక్కడ ఉత్పత్తయ్యే టస్సర్ను సెరీకల్చర్ డిపార్ట్మెంట్ ఓపెన్ యాక్షన్ ద్వారా విక్రయిస్తుంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తుంటారు. నిరుడు జిల్లా టార్గెట్ 24.10 లక్షల గూళ్లకు గాను రికార్డు స్థాయిలో 29.10 లక్షల గూళ్లు ఉత్పత్తి సాధించింది.
వందేండ్ల నుంచి సాగు..
దసలి పట్టు సాగుకు అవసరమైన ఏరుమద్ది, నల్లమద్ది చెట్లు చెన్నూర్ ప్రాంత అడవుల్లో భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ చెట్లపై పట్టు పురుగులను వదిలితే వాటి ఆకులు తింటూ లార్వాను వదిలి గూళ్లు కడుతాయి. దీంతో ఈ ప్రాంతంలో గత వంద సంవత్సరాల నుంచే దసలి సాగు చేస్తున్నారు. చెన్నూర్ మండలం లింగంపల్లి, కిష్టంపేట, చెన్నూర్, సుద్దాల, కోటపల్లి మండలం కొత్తపల్లి, రాజారం, లింగన్నపేట, బొప్పారం, కొండంపేట, పారుపల్లి, పిన్నారం, ఎర్రాయిపేట, మల్లంపేట, ఏదులబంధం, వేమనపల్లి మండలం ముల్కలపేట, నెన్నెల మండలం మన్నెగూడెం గ్రామాల్లో సుమారు 650 గిరిజన కుటుంబాలు పట్టుగూళ్ల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం 1982లో సెంట్రల్ సిల్క్ బోర్డు ఆధ్వర్యంలో చెన్నూర్‌లో పట్టుగూళ్ల ఉత్పత్తి, విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పటినుంచి వీటిని కమర్షియల్‌గా ఉత్పత్తి చేస్తున్నారు.
మంత్రి ఆదేశాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
ప్రాణహిత వైల్డ్లైఫ్సాంక్చురీ ప్రొటెక్టెడ్ ఏరియా పరిధిలో పట్టుగూళ్ల ఉత్పత్తికి అనుమతి లేదు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పట్టు రైతులకు ప్రత్యామ్నాయ ఫారెస్ట్ ఏరియాను కేటాయించేందుకు రిపోర్టు సిద్ధం చేస్తాం. మంత్రి సూచనల ప్రకారం దసలి పట్టు రైతులు ఉపాధి కోల్పోకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. -సర్వేశ్వర్, మంచిర్యాల ఎఫ్‌డీవో

