బియ్యం స్కామ్​ నిరూపిస్తవా?

బియ్యం స్కామ్​ నిరూపిస్తవా?

మాయమైన ధాన్యంపై సీబీఐ విచారణకు రెడీ
ఎఫ్​సీఐ, సివిల్ సప్లైస్​ శాఖల విధులపై కేంద్ర మంత్రికి అవగాహన లేదు
మేం కొన్న వడ్లకు ఎఫ్​సీఐకి ఏమిటి సంబంధం?

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలోని రైస్​మిల్లుల్లో బియ్యం స్కామ్​ జరిగిందని ఆరోపిస్తున్న కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి దానిని నిరూపించాలని బీసీ సంక్షేమం, సివిల్​ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్​ విసిరారు. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయిస్తే తాము సిద్ధమని చెప్పారు. గురువారం కరీంనగర్​లో మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడారు. 
ఆ వడ్లు ఎఫ్​సీఐవి ఎట్లవుతయ్
తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ది మన రాష్ట్రం కాదని, కానీ ఇక్కడి జనం ఓట్లతో గెలిచిన కిషన్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని తెలంగాణపై విషం చిమ్మారని గంగుల ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే వడ్ల సేకరణ, సీఎంఆర్​పై కిషన్​రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. సివిల్​ సప్లై శాఖ రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి మిల్లర్లకు ఇస్తుందని, అక్కడ మిల్లింగ్​ అయ్యాక ఎఫ్​సీఐకి లెవీ పెడ్తే నాలుగు నెలలకు ఎఫ్​సీఐ నుంచి డబ్బులు వస్తాయని  చెప్పారు. ఎఫ్​సీఐ తనిఖీల్లో 4.53 లక్షల బస్తాల వడ్లు తక్కువ వచ్చాయని కేంద్ర మంత్రి చెబుతున్నారని, ఆ వడ్లు ఎఫ్​సీఐవి ఎట్లవుతాయని ప్రశ్నించారు. మరాడించాక పంపే బియ్యం మాత్రమే ఎఫ్​సీఐకి చెందుతాయని, అప్పటిదాకా ఆ వడ్లు రాష్ట్ర ప్రభుత్వానివేనన్న విషయం ఆయనకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2021 యాసంగి, వానాకాలంలో కలిపి 40.5 కోట్ల బస్తాల ధాన్యాన్ని సేకరిస్తే, 4.53 లక్షల బస్తాలు తేడా వచ్చినట్లు కిషన్​రెడ్డి చెప్పారని, ఆయన చెప్పిన తేడా 0.01 శాతం ఉందని, సంచులు చినిగి కారిపోయిన వడ్లను మంత్రి లెక్కించారో లేదో? అని ఎద్దేవా చేశారు. 
మిస్​ అయితే మిల్లర్లపై చర్యలు తప్పవు
రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన వడ్లలో ఒక్క గింజ తక్కువగా ఉన్నట్లు తేలినా, మిల్లర్ల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తామని గంగుల చెప్పారు. మిల్లర్లు తప్పు చేయకుండా ఉండేందుకే రాష్ట్రవ్యాప్తంగా 51 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. తాము సొంతంగా విజిలెన్స్ టీమ్​లను ఏర్పాటు చేసుకొని తనిఖీలు చేపడుతున్నామని, ఎక్కడైనా వడ్లు మిస్​ అయితే  ఆయా మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డిలో 84,927 వేల బస్తాల ధాన్యం మాయమైందని మంత్రి చెప్పిన విషయంలో వాస్తవం లేదన్నారు. సిద్దిపేటలో 64 బస్తాలు తక్కువ వస్తే 1,659 బస్తాలు తక్కువ ఉన్నట్లు నివేదికలో ఎలా చూపించారని మండిపడ్డారు. ప్రస్తుతం యాసంగి కొనుగోళ్ల కోసం 3.57 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. జూట్ కమిషన్ ద్వారా 8 కోట్ల గన్నీ బ్యాగులు కావాలని కేంద్రాన్ని కోరితే 4.45 కోట్ల గన్నీ బ్యాగులే ఇచ్చారని విమర్శించారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి కావాల్సిన 4 కోట్ల గన్నీ బ్యాగులను జూట్ కమిషన్ ద్వారా అందించేలా కృషి చేయాలని డిమాండ్​ చేశారు.
16 లెటర్లు రాసినా స్పందించలే
2020–21 యాసంగికి సంబంధించి 62.52 లక్షల టన్నులకుగాను ఇప్పటికే 55.43 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో ఎఫ్​సీఐకి అప్పగించామని మంత్రి చెప్పారు. ఆ బియ్యం ఎఫ్​సీఐ గోదాముల్లో నిల్వ ఉండడం వల్ల స్టోరేజీ సమస్య వస్తోందని, బియ్యం తీసుకెళ్లేందుకు రైళ్లు పంపాలని కేంద్రానికి16 లేఖలు రాసినా ఇప్పటివరకు పంపలేదన్నారు. కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా కేంద్రం తీరు ఉందని మండిపడ్డారు. ఈ యాసంగి లో 1,41,853 టార్పలిన్లు, 10,632 వేయింగ్ మిషన్లు, 8,350 మాయిశ్చర్ మీటర్లు, 5,085 ప్యాడీ క్లీనర్స్ సిద్ధంగా ఉన్నాయని, కావాలంటే చెక్ చేసుకోవచ్చన్నారు. చత్తీస్​గఢ్, హర్యానా, ఏపీలో జరిగిన ప్రొక్యూర్మెంట్ పై ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండా తెలంగాణలోనే దాడులు చేయడం వివక్షేనని, దీనిపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వైట్​ పేపర్​ రిలీజ్​ చేయాలని డిమాండ్​ చేశారు.