రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది: మంత్రి గంగుల

 రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది: మంత్రి గంగుల

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశానికి మార్గదర్శకుడని.. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  బీజేపీ నేతలకు దమ్ముంటే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి గంగుల సవాల్ చేశారు. అంబేద్కర్ అందరి వాడు..భారత దేశ ఆస్తి ఆయన అని వ్యాఖ్యానించారు. దళితబంధు దేశానికి ఆదర్శమని.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశ పెట్టారని తెలిపారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి గంగుల ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయన పేరును వాడుకున్నారే తప్ప అంబేద్కర్ కు సరైన గుర్తింపు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ సంపదను దోచుకునేందుకు సమైక్య పాలకులు పాదయాత్రల పేరుతో మరోసారి కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు.