కేంద్ర మంత్రి నిర్మలపై గంగుల ఫైర్‌‌‌‌

కేంద్ర మంత్రి నిర్మలపై గంగుల ఫైర్‌‌‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ‘‘రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు చరిత్రలో ఎన్నడన్న ఉన్నయా..? ఇది మీ పబ్లిసిటీ పిచ్చికి పరాకాష్ట’’అని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. రేషన్ బియ్యంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్రంలో 90.34 లక్షల కార్డులుంటే కేంద్రం 59 శాతం కార్డులకే, అదీ ఒక్కరికే 5 కిలోలు ఇస్తున్న విషయం ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే కార్డుల్లో రూ.3 మీరిస్తుంటే, రూ.2 రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని గుర్తుచేశారు.

అదనపు కిలోకు రూ.33 చొప్పున ఏటా372 కోట్లు భరించి కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నామని చెప్పారు. 95 లక్షల మందికి ప్రతి కిలోకు రూ.33 ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికీ 6 కిలోలు ఇస్తున్నామన్నారు. దీని కోసం నెలకు రూ.300 కోట్లకు పైగా, ఏడాదికి రూ.3,610 కోట్లను రాష్ట్ర సర్కార్‌‌‌‌ భరిస్తోందని చెప్పారు. కలెక్టర్ ఒక శాఖ కోసమే పనిచేయరనే అవగాహన లేకుండా కేంద్ర మంత్రి నిర్మల.. జిల్లా అధికారుల పట్ల మర్యాద పాటించకపోవడం అన్యాయమన్నారు.