తెలంగాణ ఆస్తి కొండా లక్ష్మణ్ : గంగుల కమలాకర్

తెలంగాణ ఆస్తి కొండా లక్ష్మణ్ :  గంగుల కమలాకర్
  •     90ఏండ్ల వయస్సులో ఉద్యమం చేసిన మహనీయుడు 
  •     మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు : కొండా లక్ష్మణ్​ బాపూజీ  తెలంగాణ ఆస్తి అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కొండా లక్ష్మణ్​ జయంతి  పురస్కరించుకొని స్థానిక బైపాస్ రోడ్డులోని కొండా లక్ష్మణ్​ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం  వదిలేసిన గొప్పవ్యక్తి అని ప్రశంసించారు. 90  ఏండ్ల వయస్సులో గడ్డకట్టే చలిలో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్యమం చేసిన మహనీయుడు అని  కొనియాడారు.

కొండా లక్ష్మణ్​ తో కలిసి ఉద్యమంలో పాల్గొనడం గర్వంగా భావిస్తున్నానని,  కష్టపడి సాధించుకున్న తెలంగాణను తాను చూడకపోవడం బాధాకరమని ఆవేదన చెందారు.   బాపూజీని  గౌరవిస్తే, మనల్ని మనం గౌరవించుకున్నట్టే అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు.

హైదరాబాద్లో ట్యాంక్ బండ్ తో పాటు, జిల్లా కేంద్రాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి, ఆయన చరిత్ర భవిష్యత్ తరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాపూజీ ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారన్నారు. బాపూజీ ఒక్క కులానికో, మతానికో చెందిన వారు కాదన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రతినిధులు మెతుకు సత్యం,తదితరులు  పాల్గొన్నారు.