సమ్మె విరమించండి

సమ్మె విరమించండి
  • పంచాయతీ కార్మికులకు మంత్రి హరీశ్ విజ్ఞప్తి 
  • డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం 
  • మంత్రి ఎర్రబెల్లి చర్చలు జరుపుతారని వెల్లడి 
  • ముందు చర్చలకు పిలవాలని జేఏసీ డిమాండ్ 

హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు: వెంటనే సమ్మె విరమించాలని పంచాయతీ కార్మికులకు మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని.. సమ్మె విరమించి డ్యూటీలో చేరాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పంచాయతీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అందులో పేర్కొన్నారు. ‘‘మీరు అడక్కుండానే సీఎం కేసీఆర్ రూ.వెయ్యి జీతం పెంచారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీతో చర్చలు జరిపి వీలైనంత తొందర్లోనే సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పనికిమాలిన రాజకీయాలు చేసే పార్టీల ఉచ్చులో పడొద్దు. కేసీఆర్ మిమ్మల్ని చల్లగా చూస్తారు. సమ్మెలు, ధర్నాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకు ఉన్న గొప్ప పేరును ఖరాబ్ చేయొద్దు” అని అన్నారు. 

సమ్మె విరమించండి

కొంతమంది అర్హులైన కార్మికులు ‘అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి’గా గుర్తింపు ఇవ్వాలని కోరారని, దాన్ని సీఏం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వెంటనే సమ్మె విరమించి డ్యూటీలో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం విజ్ఞప్తి చేశారు. 

చర్చల తర్వాతే నిర్ణయం.. 

ప్రభుత్వం ముందు తమను చర్చలకు పిలవాలని, ఆ తర్వాతే సమ్మె విరమణపై నిర్ణయం తీసుకుంటామని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల జేఏసీ చైర్మన్ పాలడుగు భాస్కర్, జనరల్ సెక్రటరీ యజ్ఞ నారాయణ తేల్చి చెప్పారు. చర్చలకు పిలవకుండా, సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎలాంటి హామీ ఇవ్వకుండా సమ్మె విరమించాలని కోరితే ఎట్ల? అని బుధవారం ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలోనే పంచాయతీ కార్మికుల జీతాలు ఎక్కువ ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అంటున్నారని, కానీ అది అబద్ధమని చెప్పారు. 

కర్నాటక, ఏపీలో కార్మికులకు అక్కడి ప్రభుత్వాలు గ్రాంట్ ద్వారా రూ.12 వేల నుంచి  రూ.18 వేల జీతం ఇస్తున్నాయని తెలిపారు.  ‘‘అర్హులను అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమిస్తామని ఆరేండ్లుగా చెబుతున్నారు. కానీ ఇంతవరకు ముందుకుపడలేదు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సమ్మె విరమింపజేపియ్యడం.. ఆ తర్వాత మర్చిపోవడం ఈ ప్రభుత్వానికి అలవాటే. గత 9 ఏండ్లుగా ఇలా ఎన్నో సమ్మెలు విరమింపజేయించారు. కానీ సమస్యలు పరిష్కరించలేదు” అని ఫైర్ అయ్యారు.