కాంగ్రెసోళ్లకు ఏం జరుగుతుందో తెలియడం లేదు : మంత్రి హరీశ్​ రావు

కాంగ్రెసోళ్లకు ఏం జరుగుతుందో తెలియడం లేదు : మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు : 'పాపం కాంగ్రెసోళ్లకు కనీసం రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. మేము గెలిస్తే ఆరోగ్య శ్రీ కింద మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వేయి మందికి ఆపరేషన్లు చేయించిందన్న సంగతి తెలియదని' ఎద్దేవా చేశారు. సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల, వేములవాడ, గజ్వేల్  సర్కారు హాస్పిటల్​లో పైసా ఖర్చు లేకుండా మోకాలు చిప్పల ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. ఆదివారం సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ బీఆర్ఎస్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారన్నారు.290 ఉన్న గురుకులాల సంఖ్యను1000 కి పెంచి ఆరు లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. పేద విద్యార్థులను 20 లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. పేద పిల్లలు చదివే  గురుకులాల్లో సన్నబియ్యం భోజనం పెడుతున్నామన్నారు.

చెప్పుడు మాటలు వినకుండా కంటికి కనిపించే అభివృద్ధిని చూసి మద్దతివ్వాలని కోరారు. ఈ సందర్భంగా  ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రూపొందించిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా 21 సంఘాల ప్రతినిధులు మంత్రి హరీశ్​రావుకు మద్దతునిస్తున్నట్టు ఏకగ్రీవ తీర్మానాల కాపీలను అందజేశారు.