కేసీఆర్ పగ కోసం కాదు.. ప్రజల కోసం పని చేస్తరు : హరీశ్​రావు

కేసీఆర్ పగ కోసం కాదు.. ప్రజల కోసం పని చేస్తరు : హరీశ్​రావు

నారాయణ్​ఖేడ్, వెలుగు:  ధరణిని తీసేస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుందని, పోర్టల్​లో ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలుంటే సరిచేస్తామని మంత్రి హరీశ్​రావు అన్నారు. ధరణితో పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడిందని.. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం లేకుండా రైతులు తమ భూమిని మార్చుకోవచ్చని చెప్పారు. ‘‘ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్​వాళ్లు అంటున్నరు. ధరణి లేకుంటే మళ్లీ పటేల్,  పట్వారీ వ్యవస్థ వస్తది. కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ధరణిని వద్దంటే ప్రజలే కాంగ్రెస్​ను బంగాళాఖాతంలో కలుపుతరు” అని అన్నారు. మంగళవారం నారాయణ్​ఖేడ్​లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 


‘‘కాంగ్రెస్ వాళ్లు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటున్నారు,  గతంలో వారికి11 సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఏమీ చేయలేక తెలంగాణను అధోగతి పాలు చేశారు’’ అని హరీశ్​ విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో  పారదర్శక పాలన కొనసాగుతోందని, కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే  కమీషన్ల ప్రభుత్వం ఏర్పడి, బ్రోకర్లు తయారవుతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆసరా పెన్షన్లు రూ. 5000 వరకు, రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు. ఇందుకోసం  కేసీఆర్  అద్భుతమైన ప్రజా మేనిఫెస్టోను సిద్ధం చేశారన్నారు. బసవేశ్వర ప్రాజెక్టుతో సాగునీరు తీసుకురావడానికి రూ.1,748 కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అక్కడ ఉన్న వాళ్లు చెప్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు పనికిరానివని విమర్శించారు.

మేమే ‘ఏ’ టీం 

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిల డీఎన్ఏలు వేరని మంత్రి హరీశ్​రావు అన్నారు. ప్రతిపక్షాలది కుర్చీల కోసం మాత్రమే కొట్లాటని, తెలంగాణ ప్రజలకు తాము మాత్రమే ‘ఏ’ టీం అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై  కక్షసాధించాలని భావించడం లేదని,  ప్రజల అభివృద్ధి కోసమే పని చేస్తారన్నారు. ప్రతిపక్షాలను వేధించాలనుకుంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైలుకు వెళ్లే వాడన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎన్నటికీ కలువవని, అవి నీళ్లు, నూనె లాంటివన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఈనెల 30న నిర్వహించే  సీఎం ప్రజా ఆశీర్వాదసభను విజయవంతం చేయాలని మంత్రి హరీశ్​రావు కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, లీడర్లు చింతల గీతారెడ్డి, భిక్షపతి, మామిడ్ల రాజేందర్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.