హైకోర్టు ఆర్డర్ అందినంక నిర్ణయం తీసుకుంటం

హైకోర్టు ఆర్డర్ అందినంక నిర్ణయం తీసుకుంటం

హైదరాబాద్, వెలుగు: ఒమిక్రాన్ నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు అన్నారు. కోర్టు ఆర్డర్ కాపీ ఇంకా తమకు అందలేని, అది అందినంక సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒమిక్రాన్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బూస్టర్ డోస్, పిల్లలకు వ్యాక్సిన్ పై కేంద్రాన్ని అడిగామని.. కానీ ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. గురువారం హైదరాబాద్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆసుపత్రిలో ఐసీయూ బిల్డింగ్, కొత్త ఆపరేషన్ థియేటర్లను ఆయన ప్రారంభించారు. వీటి ఏర్పాటుకు సహకరించిన మేఘా కంపెనీని అభినందించారు. ఆస్పత్రికి ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మంచి ట్రీట్ మెంట్ అందించడమే తమ లక్ష్యమన్నారు. మహిళల విద్య కోసం దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఎంతో కృషి చేశారని.. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.