అమరవీరుల గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదు

అమరవీరుల గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదు

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. అమరవీరుల స్థూపం తాకే, వారి గురించి మాట్లాడే అర్హత కిషన్ రెడ్డికి లేదని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తామంతా తెలంగాణ కోసం రాజీనామా చేస్తే.. పదవి కోసం పాకులాడిన వ్యక్తి కిషన్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్తో చర్చ జరిపే స్థాయి కిషన్ రెడ్డికి లేదన్న హరీశ్.. కేంద్రం ఏ విషయంలోనూ రాష్ట్రానికి మద్దతు ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ను విమర్శించడం పక్కనబెట్టి దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకురావాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. 

సీఎం కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రికి లేదని హరీశ్ అన్నారు. తెలంగాణ ప్రజల భాషను కేసీఆర్ మాట్లాడుతారన్న ఆయన.. బీజేపీది మతాల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే భాష అని ఆరోపించారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే కిషన్ రెడ్డి.. రాజాసింగ్ భాష గురించి ఏం చెబుతారని అన్నారు. అసోం సీఎం మాట్లాడిన మాటలను మహిళగా డీకే అరుణ ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినందునే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారని హరీశ్ రావు చురకలంటించారు. 2019 ఆగస్టు 6న ఆర్టికల్ 370పై చర్చ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ఏర్పాటును బ్లాక్ డేగా అభివర్ణిస్తే కిషన్ రెడ్డి బల్లలు చరిచిన విషయాన్ని గుర్తు చేశారు.