ఇప్పుడు అప్లికేషన్లు అమ్ముతున్నరు.. గెలిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తరు: హరీష్రావు

ఇప్పుడు అప్లికేషన్లు అమ్ముతున్నరు.. గెలిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తరు: హరీష్రావు
  • కాంగ్రెస్​పై హరీశ్​రావు ఫైర్
  • బీజేపీకి క్యాడర్ లేదు..
  • కాంగ్రెస్​కు లీడర్లు లేరు బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని వెల్లడి

మెదక్, వెలుగు: ఇప్పుడు అభ్యర్థులకు అప్లికేషన్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్​ పార్టీ.. రేపు గెలిస్తే రాష్ట్రాన్నే అమ్మేస్తుందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. శనివారం మెదక్ లో మైనార్టీలకు లక్ష రూపాయల సాయం చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​కు 35 నుంచి 40 స్థానాల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.  కర్నాటకలో కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక అక్కడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. 

‘కాంగ్రెస్​కు లీడర్లు లేరు, బీజేపీకి క్యాడర్ లేదు.. బీఆర్​ఎస్​కు తిరుగు లేదు’ అని హరీశ్​ రావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, డిపాజిట్లు దక్కంచుకునేందుకే ఆరాటపడుతు న్నదన్నారు. ఎవరెన్ని ట్రిక్కులు ప్లే చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని,  గతంలో కంటే ఎక్కువ సీట్లే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 
రుణమాఫీని పూర్తి చేస్తం
సీఎం ఇచ్చిన మాట ప్రకారం 30 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్టు మంత్రి హరీశ్​రావు తెలిపారు. 99,999 లోపు రుణాలన్నీ మాఫీ అయ్యాయని, లక్ష వరకు ఉన్న రుణాలు కూడా త్వరలో మాఫీ చేస్తామని మంత్రి వెల్లడించారు. క్లోజ్ అయిన, వాడుకలో లేని అకౌంట్లతో కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నట్టు తెలిసిందని, అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా మన్నారు. ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు.  
సీఎం పర్యటన విజయవంతం చేయాలి
కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్  ప్రారంభించేందుకు 23న సీఎం కేసీఆర్​ మెదక్ వస్తున్నారని హరీశ్​రావు వెల్లడించారు. మెదక్ ప్రజల చిరకాల కోరికైన జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదేనన్నారు. 

మెదక్​కు మెడికల్​ కాలేజీ మంజూరు చేశామని, వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు, రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని హరీశ్​రావు పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఉన్నారు.