
- 18 మందికి అందజేసిన మంత్రి హరీశ్ రావు
- చివరి నిమిషంలో తగ్గిన లబ్ధిదారుల జాబితా
- చింతమడక వాసులకు 18 యూనిట్ల పంపిణీ
సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ సొంతూరు చింతమడక గ్రామ పంచాయతీకి చెందిన 20 మందికి తొలివిడతగా 18 యూనిట్లను పంపిణీ చేశారు. గురువారం సిద్దిపేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన 9 మందికి ట్రాక్టర్ లు, 8 మందికి ట్రాలీ జీపులు, మూడు కుటుంబాలకు కలిపి రూ.30 లక్షల విలువైన జేసీబీని అందజేశారు. ఒక్కో కుటుంబానికి ఉపాధి కోసం వారు కోరుకున్న విధంగా రూ. పది లక్షల విలువైన యూనిట్లను పంపిణీ చేశారు. మొదట 50 మంది లబ్ధిదారులకు 50 యూనిట్లను అందజేస్తున్నట్లు అధికారులు ప్రకటించినా తరువాత దాన్ని 35కు కుదించారు. కార్యక్రమ ప్రారంభ సమయానికి లబ్ధిదారులు కోరుకున్న విధంగా కొన్ని యూనిట్లు అందకపోవడంతో కేవలం 20 మందికి సంబంధించి 18యూనిట్లను మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన 30 మందిలో 15 మందికి ఒకటి రెండు రోజుల్లో, మిగిలిన 15 మందికి వారం పది రోజుల్లో వారు కోరుకున్న యూనిట్లను అందజేస్తా మని అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రిహరీశ్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సొంతూళ్లో పేదరికమన్నదే ఉండకూడదన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, లబ్ధిదారులువారి ఉపాధికి అవసరమైన యూనిట్లను ఎంచుకోవాలని సూచించారు. వాహనాల పంపిణీలో ఎలాంటి అవినీతికి తావులేకుండా చూస్తామని,ఈ ప్రక్రియను అందరికి ఉపాధి లభించే వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.