కరోనాపై ఆందోళనొద్దు.. అప్రమత్తత అవసరం: హరీష్ రావు

కరోనాపై ఆందోళనొద్దు.. అప్రమత్తత అవసరం: హరీష్ రావు

కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కోవిడ్ సన్నద్ధతపై మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎఫ్.7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్ సన్నద్ధత పై మంత్రి సూచనలు చేశారు. 

ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు సిద్ధంగా ఉందని ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో తెలంగాణ ఇప్పటికే కరోనాను విజయవంతంగా.. ఎదుర్కొని దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేనప్పటికీ.. ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‭ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.