దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం: మంత్రి హరీశ్ రావు

దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేటపై మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. 'సిద్దిపేట అంటేనే స్వచ్ఛత.. స్వచ్చత అంటేనే సిద్దిపేట' అన్న మంత్రి.. స్వచ్ఛతలో, హరితహారంలో సిద్దిపేటకు 22 అవార్థులు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవంలో మంత్రి హరీష్ రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'స్వచ్ఛ పూదోట మన సిద్దిపేట. సిద్దిపేట పేరు లేకుండా కేంద్రం నుంచి గాని, రాష్ట్రం నుంచి కానీ అవార్డులు ఉండవు. ఒక్క పార్కు లేని మన సిద్దిపేటలో ఎన్నో పార్కులు అభివృద్ధి చేసుకున్నాం. కోమటి చెరువు కోటి అందాలతో వెలుగొందుతోంది. దేశంలో ఎక్కడా లేని విదంగా రైతు మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠ దామాలు ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు.. విద్యానిలయంగా మార్చుకున్నాం. ఆరోగ్య నిలయంగా మార్చుకోబోతున్నాం. 6 నెలల తరువాత రంగనాయకసాగర్ చూస్తే దేశం ఆశ్చర్యపోతుంది. దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం.." అంటూ మంత్రి ప్రశంసలు కురిపించారు.

ఇక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "దేశమంతా తెలంగాణ పనితీరును గమనిస్తోంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి.. తమ రాష్ట్రాల్లో ఎందుకు జరగడం లేదన్న చర్చ దేశ వ్యాప్తంగా మొదలైంది. సిద్దిపేట దినదినాభివృద్ధి సాధిస్తూ దేశంలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీగా నిలిచింది. ఎన్నో ప్రభుత్వాలను చూశా. ఎందరో ముఖ్యమంత్రులను చూశా. గత పాలనకు, నేటి పాలనకు ఎంత తేడా ఉందో కళ్ల ముందు కనిపిస్తోంది. ఇదే అభివృద్ధి కావాలంటే మూడో సారి బీఆర్‌ఎస్‍కు విజయం అందించాలి..' అని కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.