కొంతమంది డాక్టర్ల వల్ల వైద్య వృత్తికి చెడ్డ పేరు: మంత్రి హరీశ్

కొంతమంది డాక్టర్ల వల్ల వైద్య వృత్తికి చెడ్డ పేరు: మంత్రి హరీశ్

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో రాష్ట్రం మెడికల్ హబ్ గా మారిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించిన హైబిజ్ హెల్త్ కేర్ అవార్డుల ప్రదానోత్సవంలో వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. వైద్య వృత్తి చాలా గొప్పదని తెలిపారు. అన్నం పెట్టే రైతును, దేశాన్ని కాపాడే సైనికుడిని, ప్రాణాల్ని కాపాడే డాక్టర్ ని ప్రజలు దేవుళ్లలా కొలుస్తారని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు కొంత మంది స్వార్ధపూరిత డాక్టర్ల వల్ల డాక్టర్ల కీర్తి ఇవాళ మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైద్యాన్ని ప్రజాసేవ కోసం కొంత మంది డాక్టర్లు ఉపయోగిస్తుంటే... మరికొంత మంది మాత్రం డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేస్తూ వైద్య వృత్తికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అన్నారు. డాక్టర్లు కమెర్షియల్ గా ఆలోచించడం మానేయాలని, అవసరానికి మించి ప్రిస్క్రిప్షన్లు రాయొద్దని మంత్రి కోరారు. ఇక కపిల్ దేవ్ ఆటను చూడటానికి కాలేజీకి డుమ్మా కొట్టే వాడినంటూ మంత్రి తన కాలేజ్ రోజులను గుర్తు చేసుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తితో ఇవాళ స్టేజ్ పంచుకోవడం ఆనందంగా ఉందని హరీశ్ రావు చెప్పారు.