కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు: హరీశ్ రావు

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దు: హరీశ్ రావు

కోవిడ్ వ్యాక్సిన్ (COVID–19 vaccine) తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయెద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) విజ్ఞప్తి చేశారు. ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందామని ఆయన కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు సూచించారు హరీశ్ రావు. అన్ని పీహెచ్ సీ, యూపీహెచ్ సీ లలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి అదేశించారు. 

రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు మార్చి 17న సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. మాస్కులు ధరించి, జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు (Covid–19) మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్‌ నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాలకు లేఖలో రాసిన వాటిలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక ఉన్నాయి.