సర్కార్ దవాఖాన్లలోనే 76 శాతం డెలివరీలు: మంత్రి హరీశ్‌‌రావు

సర్కార్ దవాఖాన్లలోనే 76 శాతం డెలివరీలు: మంత్రి హరీశ్‌‌రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత నెల జరిగిన మొత్తం డెలివరీల్లో 76.3 శాతం ప్రభుత్వ దవాఖాన్లలోనే జరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌ రావు వెల్లడించారు. అత్యధికంగా నారాయణ్ పేట్ జిల్లాలో 89 శాతం, ములుగు లో 87శాతం, మెదక్ జిల్లాలో 86 శాతం జరిగాయని తెలిపారు. ఆగస్టు నెలలో అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి మెదక్ జిల్లా మొదటి స్థానంలో, గద్వాల్ రెండో స్థానంలో నిలి చాయని చెప్పారు. చివరి స్థానంలో జగిత్యాల, ఆసిఫాబా ద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు మంగళవారం హెల్త్ ఆఫీసర్లు, సిబ్బందితో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. 

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. పాముకాటు, కుక్కకాటు మందులను అన్ని పీహెచ్​సీల్లో అందుబాటులో ఉంచామని, ఎక్కడా లేవు అనే మాట రావొద్దన్నారు. 

సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, జిల్లా వైద్యాధికారులు పంచాయతీ, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా స్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మలేరియా, డెంగీ కేసులు నమోదైతే తక్షణం వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.