జీవన్ దాన్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

జీవన్ దాన్ లో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్

ఎల్బీ నగర్, వెలుగు: అవయవ దానానికి ప్రతిఒక్కరు ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టగలరని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్​ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవయవ దాన కార్యక్రమానికి హరీశ్​రావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవన్ దాన్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. అవయవదానానికి ముందుకొచ్చిన 250 మందికి అభినందనలు తెలుపుతూ, సర్టిఫికెట్లు అందజేశారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఎలాంటి ఖర్చు లేకుండా ఆర్గాన్ మార్పిడి చేస్తున్నామని గుర్తుచేశారు. ఎల్బీనగర్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, జయచంద్ర రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కమలా రెడ్డి, జీవన్ దాన్ అధికారులు పాల్గొన్నారు.

2023 విద్యా నామ సంవత్సరం

ఈ కొత్త సంవత్సరంలో టీచర్లు, విద్యారంగ సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. సర్కారు బడులు కొత్త వైభవం సంతరించుకుంటాయని, 2023 విద్యానామ సంవత్సరం అవుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డైరీని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కావలి అశోక్ కుమార్,​ కటకం రమేశ్‌‌తో కలిసి ఆవిష్కరించారు. ప్రత్యేకమైన ప్రణాళికతో పటిష్టమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా టీచర్ల ప్రమోషన్లు, బదిలీలను చేపడతామని చెప్పారు.