
తెలంగాణ రాష్ట్రం తమ ప్రభుత్వ పాలనలో ఆర్థికవృద్ధి సాధిస్తోందని తెలిపారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలనలో భారత ఆర్థిక వృద్ధి బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని విమర్శించారు. భారత్ తలసరి ఆదాయం కంటే బంగ్లాదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక వృద్ధిని సాధిస్తూ దూస్కెళ్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం 11.7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసిందని, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించిందని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632గా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 1.84 రెట్లు ఎక్కువ అని తెలిపారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశానికి ఇచ్చే GDPలో తెలంగాణ రాష్ట్రం 6వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నామని చెప్పారు.గడిచిన ఆరేళ్ల 8.7 శాతం వృద్ధి రేటు తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. మన రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ విద్యుత్ కలెక్షన్స్ ఉన్నాయని..అందరికీ ఉచితంగా విద్యుత్ రైతులకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. సీఎం కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని ఆయన తెలిపారు.
కేంద్రంమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర పేరుతో అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి హరీశ్ రావు. కేసీఆర్, టీఆరెస్ లు ఉన్నంత కాలం తెలంగాణ లో కాంగ్రెస్, బీజేపీ లు ప్రథమ స్థానంలోకి రాలేరని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లది ఆధిపత్య పోరు తప్ప ఇంకొకటి కాదన్న హరీశ్.. ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకోవడం కోసం విమర్శలు చేయడం తప్ప ఎజెండా లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ ,డీజిల్ ధరలు పెంచడం లో వృద్ధి సాధించిందని ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ ధరను డబుల్ చేయడం లో కూడా కూడా ఘోరమైన వృద్ధి సాధించిందన్నారు.