ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గడిచిన కొన్నేళ్లుగా పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, ఇప్పుడు ఆయన రూటు మార్చి నేటి సమాజంలోని అత్యంత భయంకరమైన ‘డ్రగ్స్’ సంస్కృతిని ఇతివృత్తంగా తీసుకుని ‘యుఫోరియా’ (Euphoria)ను రూపొందించారు. ఇవాళ శుక్రవారం (2026 ఫిబ్రవరి 6న) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇందులో సీనియర్ నటి భూమిక, ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ కీలక పాత్రల్లో కనిపించగా, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. కాలభైరవ సంగీతం అందించారు. మరి జెన్ జీని (జనరేషన్ Z) దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిన ఈ ‘యుఫోరియా’ కథ ఏంటి? ప్రసెంట్ జనరేషన్కి ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? గుణ శేఖర్ కంబ్యాక్ ఇచ్చాడా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
ఈ కథ ‘సివిల్ సర్వెంట్’ కావాలని కలలు కనే ఒక సామాన్య యువతి చైత్ర (సారా అర్జున్) చుట్టూ తిరుగుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆమె జీవితం, ఒక్క రాత్రిలో తలకిందులవుతుంది. డ్రగ్స్ మత్తులో తూగుతున్న ఒక యువకుడు ఆమెపై జరిపిన అఘాయిత్యం, ఆ అమ్మాయి ఆశయాలను చిన్నాభిన్నం చేస్తుంది. చైత్ర ఈ విషయాన్ని తన పేరెంట్స్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మేనన్) ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు.
అయితే, అత్యాచారం చేయడంలో భాగమైన ఐదుగురు కుర్రాళ్ల కథేంటీ? ఈ కేసులో తాను కూడా నేరం చేశానని వింధ్య వేములపల్లి (భూమిక) హైకోర్టుకు ఎందుకు వెళుతుంది? అసలు వింధ్య చేసిన తప్పు ఏంటి? ఇంతకీ వింధ్య ఎవరు? కమిషనర్ జయదేవ్ కేసుని సాల్వ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఐదుగురు కుర్రాళ్లకు ఎలాంటి శిక్ష పడింది? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే:
సమాజాన్ని ఆలోచింపజేసే ప్రశ్నలతో ‘యుఫోరియా’ తెరకెక్కింది. నేటి యువత మాదకద్రవ్యాల ఊబిలో చిక్కుకుని, విచక్షణ కోల్పోయి ఎలా నేరాలకు పాల్పడుతున్నారో దర్శకుడు గుణశేఖర్ కళ్ళకు కట్టినట్లు చూపించారు. అయితే, కేవలం డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలనే కాకుండా, బాధ్యతాయుతమైన పేరెంటింగ్ ఎంత ముఖ్యమో ఈ సినిమాలో చెప్పిన పాయింట్ హైలెట్గా నిలిచింది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘పట్టరాని ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహమే ఈ ‘యుఫోరియా’. ఆ ఆనందంలో మనల్ని మనం అదుపు చేసుకోలేక అదుపు తప్పితే జీవితమే నాశనం అవుతుంది. అలాగే పేరెంటింగ్ సరిగ్గా లేక పిల్లలు పెడదారి పట్టడం, తద్వారా సమాజం మీద చెడు ప్రభావం పడటం లాంటి అంశాల చుట్టూ ప్రధానంగా సాగింది. ఓవరాల్గా.. ఎంటర్‌టైన్ చేస్తూనే మెసేజ్ ఇచ్చేలా ఉండటం ‘యుఫోరియా’ ప్రత్యేకత.
ఎవరెలా నటించారంటే?
ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగినది. నిందితుడైన యువకుడి తల్లిగా ఆమె నటించారు. సాధారణంగా కన్న కొడుకు తప్పు చేస్తే కప్పిపుచ్చే తల్లులను మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ భూమిక తన కొడుకు చేసిన నేరాన్ని భరించలేక, బాధితురాలికి న్యాయం చేయాలని స్వయంగా హైకోర్టును ఆశ్రయిస్తుంది. "ఆమె చేసిన నేరం ఏంటి?" అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తోంది. మాతృత్వానికి, నీతికి మధ్య జరిగే ఈ సంఘర్షణ సినిమాకే హైలైట్ కానుంది. ఈ క్రమంలో సాగే ఉత్కంఠభరిత పరిణామాలు గుండెల్ని పిండేసేలా చేయడంలో గుణ శేఖర్ సక్సెస్ అయ్యారు.
పోలీస్ కమిషనర్ జయదేవ్ నాయర్‌గా నటుడు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. ఈ కేసును ఛేదించే క్రమంలో ఆయన 'పోక్సో' (POCSO) చట్టాన్ని ఎలా ప్రయోగించారు? ఆధారాలను ఎలా సేకరించారు? అనే అంశాలను గుణశేఖర్ ఎంతో సహజంగా తెరకెక్కించాడు. అందరు కనెక్ట్ అవుతారు. ఇంకా చైత్ర పాత్రలో నటించిన సారా అర్జున్ పాత్ర ఆకట్టుకుంటుంది. మొదట్లో బాధితురాలిగా సారా కనబర్చిన నటన కన్నీళ్లు తెప్పిస్తే క్లైమాక్స్‌లో కనిపించిన తీరు విజిల్స్ వేయిస్తుంది. అలాగే, మరో లీడ్ రోల్ చేసిన విఘ్నేష్ సైతం క్లైమాక్స్‌లో మెప్పిస్తాడు.
టెక్నీకల్ టీమ్:
నీలిమా గుణశేఖర్ నిర్మాణం, కాల భైరవ సంగీతం టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ప్రవీణ్ కుమార్ పోతన్ విజువల్స్ బాగున్నాయి. చివరగా డైరెక్టర్ గుణశేఖర్.. తన పరిధి నుంచి బయటికొచ్చి రాసుకున్నఈ కథ పవర్ ఫుల్గా ఉంది. పిల్లలు, పేరెంట్స్ ఆలోచించేలా చేసిన గుణశేఖర్ ప్రయత్నం గుర్తుండిపోతుంది. చివరగా.. బాధ్యతాయుతమైన పేరెంటింగ్ ఎంత ముఖ్యమో చెప్పే కథే ‘యుఫోరియా’.
