24 గంటల పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చిన్రు : మంత్రి హరీష్ రావు

24 గంటల పవర్ ఇచ్చినందుకే ప్రజలు మాకు పవర్ ఇచ్చిన్రు : మంత్రి హరీష్ రావు

సీఎం కేసీఆర్కు పాలిటిక్స్ అంటే టాస్క్ అని.. మిగతా వాళ్లకు అదో గేమ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా ఎందుకు అమలుకావడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మిషన్  భగీరథ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్రం కూడా మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి అమలు చేస్తోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా దేశంలో ఇప్పటికీ కూడా 51 శాతం జనానికి స్వచ్ఛమైన నీరు అందడం లేదని హరీష్ వాపోయారు. తెలంగాణలో మాత్రం 100శాతం డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతోందని చెప్పారు. రూ. 36,900 కోట్ల వ్యయంతో చేపట్టిన  మిషన్ భగీరథ పనులను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేయడం ద్వారా..రూ. 8033 కోట్లు ఆదా చేసినట్లు హరీష్ వెల్లడించారు. 

రాష్ట్రంలో వేసవి కాలంలోనూ చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. 2014 ముందు ఎండిన చెరువులు ఇప్పుడు జలకళ సంతరించుకోవడాన్ని ప్రస్తావించారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు శిథిలమయ్యాయని.. అందుకే మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించామన్నారు. మిషన్ కాకతీయ వల్ల భూగర్భజలాలు ఉబికివస్తున్నాయని అన్నారు. 

ప్రపంచంలో ఎక్కడా కట్టని విధంగా కేవలం మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసేందుకు దేశ,  విదేశాల నుంచి వస్తున్నారని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందల సంఖ్యలో కేసులు వేశారని..అయినా..చిత్త శుద్ధితో కాళేశ్వరాన్ని నిర్మించినట్ల వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు 63 శాతం పూర్తయ్యాయన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు.