కేసీఆర్ ​లాంటి లీడర్​ దేశంలో లేడు

కేసీఆర్ ​లాంటి లీడర్​ దేశంలో లేడు

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రం తీరుతోనే తెలంగాణ అప్పులు పెరిగాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. పన్నుల రూపంలో రెవెన్యూ వసూలు చేస్తే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందనే, సెస్సుల రూపంలో కేంద్రం ఆదాయం సమకూర్చుకుంటోందని ఆయన విమర్శించారు. జీఎస్‌‌డీపీలో తెలంగాణ అప్పులు కేవలం19.25 శాతమేనని, కేంద్రం జీడీపీలో 58.5 శాతం అప్పులు చేస్తోందని చెప్పారు. కేంద్రం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు చాలా తక్కువన్నారు. రాష్ట్రం రూ.18,647 కోట్ల రెవెన్యూ లోటులో ఉందని వెల్లడించారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్‌‌2022–23పై నిర్వహించిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో రూ.5.25 లక్షల కోట్లు సెస్సుల రూపంలో సమీకరించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నారన్నారు. పెట్రోల్‌‌, డీజిల్‌‌ అమ్మకాల ద్వారానే రూ.3.03 లక్షల కోట్లు సేకరించనున్నారన్నారు. సెస్సుల రూపంలో వచ్చే ఆదాయంలో 29 శాతం వాటా మాత్రమే రాష్ట్రాలకు వస్తుందన్నారు. కరోనా టైంలోనూ రాష్ట్రాలకు వాటాగా ఇవ్వాల్సిన మొత్తాన్ని కేంద్రం అప్పులుగా తీసుకోవాలని సూచించిందని, ఉదయ్‌‌ స్కీం ద్వారా డిస్కంల అప్పులు కట్టడంతోనూ రాష్ట్ర ఖాతాలో అప్పుల భారం పెరిగిందని అన్నారు.

సీఎం కేసీఆర్‌‌ కృషితో రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్‌‌ ఇస్తున్నామని హరీశ్​తెలిపారు. భద్రాద్రి పవర్‌‌ ప్లాంట్‌‌ నిర్మాణం పూర్తయిందని, యాదాద్రి పవర్‌‌ ప్లాంట్‌‌ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నాటికి పవర్‌‌ సర్‌‌ ప్లస్‌‌ స్టేట్​గా తెలంగాణ అవతరిస్తుందన్నారు. కల్యాణలక్ష్మీ, మిషన్‌‌ భగీరథ, కేసీఆర్‌‌ కిట్‌‌ స్కీమ్​లు ఎన్నికల హామీలు కావని, అయినా వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్‌‌ కిట్‌‌ కోసం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టామని, 10.85 లక్షల మందికి లబ్ధి చేకూర్చామన్నారు. రైతులకు రూ.50 వేల కోట్ల సాయం ఇచ్చిన నాయకుడు దేశంలో కేసీఆర్‌‌ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌ అధికారంలో ఉన్నప్పుడు కింద భువి.. పైన రవి.. మధ్యలో పైరవీ అన్నట్టు ఉండేదని, అసెంబ్లీ నడిచేప్పుడు ఇక్కడి లాడ్జీల్లో రూములన్నీ పైరవీకారులతో నిండిపోయేవని అన్నారు. తమ ప్రభుత్వం పైరవీలకు తావు లేకుండానే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోందన్నారు.

కాళేశ్వరంతో 2.30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినం

రాష్ట్ర బడ్జెట్‌‌లో ఎస్సీల జనాభా ప్రకారం15.45 శాతం నిధులే కేటాయించాల్సి ఉన్నా వారిలో పేదరికాన్ని పోగొట్టేందుకు 23.09 శాతం నిధులు కేటాయించామని హరీశ్ ​గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మొదటి పంపుహౌస్‌‌ మేడిగడ్డ నుంచి 93.45 టీఎంసీల నీళ్లు ఎత్తిపోశామని, అవే నీళ్లు మిడ్‌‌ మానేరుకు, అనంతగిరి, రంగనాయకసాగర్‌‌, మల్లన్నసాగర్‌‌, కొండపోచమ్మకు లిఫ్ట్​చేశామని చెప్పారు. నిరుడు ఎండాకాలంలో అవే నీళ్లను నిజాంసాగర్‌‌కు తరలించామన్నారు. కాళేశ్వరం కింద 2.30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చామన్నారు. కాంగ్రెస్‌‌ పాలనలో ఏ కాలమైనా ఎండాకాలం లెక్కనే ఉండేదని, తమ ప్రభుత్వంలో ఎండాకాలంలోనూ వాగులు పారుతున్నాయని, చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని అన్నారు.  

ఆ ఎమ్మెల్యేను చూసి జాలి పడ్డ

కార్పొరేషన్‌‌ల ద్వారా అవుట్‌‌ ఆఫ్‌‌ ది బడ్జెట్‌‌ లోన్‌‌లు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో తీసుకునే ఈ లోన్‌‌లకు, కేంద్రానికి సంబంధమే లేదన్నారు. రాష్ట్రంలో ఆరుసార్లు బడ్జెట్‌‌ ప్రవేశపెట్టి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఓ నాయకుడు కార్పొరేషన్‌‌ల నుంచి తీసుకునే రుణ పరిమితిని ఒక శాతం నుంచి మూడు శాతానికి కేంద్రమే పెంచిందని మాట్లాడుతున్నారని, అది చూసి జాలి పడ్డానని పరోక్షంగా ఈటలను ఉద్దేశించి హరీశ్​ వ్యాఖ్యానించారు. పీఆర్సీ కమిటీలో ఉన్న ఖాళీలన్నీ డైరెక్ట్‌‌ రిక్రూట్‌‌ చేసేవి కావని, వాటిలో 48,600 పోస్టులు ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నేతలను మించినోళ్లు లేరని, వాళ్లకు అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పడంలో నోబెల్‌‌ బహుమతి ఇవ్వాలన్నారు. అప్పులు తెచ్చేదానిలో 90 శాతం క్యాపిటల్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌గానే ఖర్చు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజలు ఏడేండ్లలో కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు ఇస్తే కేంద్రం మన రాష్ట్రానికి రూ.1.93 లక్షల కోట్లే ఇచ్చిందని అన్నారు. 

వృద్ధిలో నెంబర్​ వన్

జీఎస్ డీపీ వృద్ధిలో 11.2 శాతంతో తెలంగాణ దేశంలోనే నంబర్‌‌ వన్‌‌గా నిలిచిందని మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.4.57 లక్షల కోట్లున్న జీఎస్​డీపీ ఇప్పుడు రూ.11.54 లక్షల కోట్లకు చేరిందన్నారు. 2014లో తలసరి కరెంట్‌‌ వినియోగం 1,110 యూనిట్లయితే 2021 నాటికి 2,012 యూనిట్లకు చేరిందని.. రాష్ట్ర ప్రగతికి ఇది అద్దం పడుతోందన్నారు. కాంగ్రెస్‌‌ పార్టీ గాంధీ పేరు చెప్పుకొని దేశాన్ని 50 ఏండ్లు పాలించిందని, ఇప్పుడూ ఆయన పేరుతోనే బతుకున్నారు కానీ ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించలేకపోయారని విమర్శించారు. పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్‌‌ సమావేశాలంటే ఎండిపోయిన వరి, మక్క కంకులు, లాంతర్లు, కుండలతో వచ్చెటోళ్లని, ఇప్పుడు వాటి గురించి ఎవరూ మాట్లాడలేనంతగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్నారు.