ప్రతి ఆస్పత్రిలో 3 నెలలకు సరిపడా స్టాక్​: హరీశ్ రావు

ప్రతి ఆస్పత్రిలో 3 నెలలకు సరిపడా స్టాక్​: హరీశ్ రావు
  • త్వరలో మూడు జిల్లాల్లో ఆయూష్ ఆస్పత్రులు
  • హాస్పిటళ్లలోని శానిటేషన్, ఇతర సిబ్బంది వేతనాలు పెంచుతం
  • సిద్దిపేటలో 50 బెడ్స్​ హాస్పిటల్​కు మంత్రి శంకుస్థాపన

సిద్దిపేట, వెలుగు: సర్కార్​దవాఖాన్లలో ఫ్రీగా ఇచ్చే మందుల సంఖ్యను 720 నుంచి 843కు పెంచినట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు. సోమవారం సిద్దిపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్, 50 బెడ్స్ ఆయూష్ హాస్పిటల్ బిల్డింగ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. తర్వాత మాట్లాడుతూ రాష్ట్రంలో 12చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఆసుపత్రిలో మూడు నెలలకు సరిపడేలా మెడిసిన్ స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. రూ. 20 కోట్లతో వైద్య పరికరాల నిర్వహణకు పాలసీ రూపొందించామని తెలిపారు. ఆసుపత్రులలో పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీబీ, క్యాన్సర్ రోగులకు డైట్ ఛార్జీలు రూ.56 నుంచి రూ.112 కు, సాధారణ రోగులకు రూ.40 నుంచి రూ.80కు పెంచినట్లు వివరించారు. రూ.6 కోట్లతో నేచర్ క్యూర్ ఆసుపత్రి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఆయూష్ కు మంచి భవిష్యత్తు ఉందన్నారు. సిద్దిపేటతోపాటు వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో 50 బెడ్స్ ఆయూష్ ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నార్మల్ డెలివరీలు పెంచేలా యోగ ఎంతో సహాయకరంగా ఉంటుందని, వేమన యోగ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ద్వారా జిల్లాలో గర్భిణీలకు యోగ క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మెడికల్ పీజీ క్లాసులు ప్రారంభం

సిద్దిపేట మెడికల్ కళాశాలలో మొదటి పీజీ బ్యాచ్ స్టూడెంట్స్ పరిచయ కార్యక్రమంలో హరీశ్ పాల్గొని మాట్లాడారు. మొదటి సంవత్సరంలోనే సిద్దిపేట మెడికల్ కాలేజ్ కు రికార్డ్ స్థాయిలో 57 పీజీ సీట్లు సాధించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మల్టీ స్పెషాలిటీ కోర్సుల సీట్ల సంఖ్యను పెంచుతామని, మెడికల్ కాలేజీలలో ప్రాక్టికల్స్ కోసం డెడ్ బాడీల కొరత ఉందని  గుర్తుతెలియని వ్యక్తుల డెడ్ బాడీలను మెడికల్ కాలేజీలలో ఉపయోగించరాదని చట్టంలో చెప్తున్నందున  దాని పరిష్కారానికి వివిధ శాఖల అధికారులతో సంప్రదిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథలాబ్, కీమోథెరపీ, రేడియో థెరపీ సేవలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు.