మాదిగలది ఆత్మగౌరవ పోరాటం : మంత్రి హరీశ్​రావు

మాదిగలది ఆత్మగౌరవ పోరాటం : మంత్రి హరీశ్​రావు
  • మాదిగలది ఆత్మగౌరవ పోరాటం : మంత్రి హరీశ్​రావు
  • ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది

ముషీరాబాద్,వెలుగు : మాదిగలది ఆత్మగౌరవ పోరాటమని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, రెండుసార్లు  అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుందని విమర్శించారు.  రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ పై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమైన వాటాకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆదివారం మాదిగల యుద్ధ భేరి సభ జరిగింది. 

మంత్రి హరీశ్​రావు హాజరై మాట్లాడుతూ... దళిత బంధు పథకంపై దేశంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదని, కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి అమలులోకి తెచ్చారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఎస్సీ స్టడీ సర్కిల్​, ఐఏఎస్ అకాడమీని బలోపేతం చేశామన్నారు. ఎస్సీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. వైన్ షాప్ ల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించి కౌంటర్ల మీద కూర్చోపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. 

వచ్చే ప్రభుత్వంలో మాదిగలకు పెద్దపీట వేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సదాలక్ష్మి విగ్రహం, మాదిగల ఆత్మగౌరవ బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నామినేటెడ్, ఎమ్మెల్సీ పదవులు వచ్చే విధంగా కేసీఆర్ తో మాట్లాడి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు వెంకట వీరయ్య, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, మల్లేశ్, బంగారు శ్రీనివాస్, ప్రవీణ్, లక్ష్మి, కొల్లూరు వెంకట్, శ్రీకాంత్,చందు తదితరులు పాల్గొన్నారు.