కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా..ఇక్కడోళ్లకే జీతాలెక్కువ : హరీష్​ రావు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా..ఇక్కడోళ్లకే జీతాలెక్కువ : హరీష్​ రావు

కరీంనగర్​లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా పాత స్ర్కిప్ట్ చదివి వెళ్లిండు 
తెలంగాణకు బీఆర్​ఎస్సే శ్రీరామ రక్ష 
అభివృద్ధిలో రాష్ట్రం నంబర్​వన్​.. కేంద్రం కంటే ఎంతో ఎత్తులో ఉన్నమని కామెంట్​

హైదరాబాద్, వెలుగు : దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోతుంటే.. తెలంగాణ అన్నింటా ముందు ఉందని మంత్రి హరీశ్​రావు అన్నారు. బీఆర్ఎస్​ను ఉద్దేశిస్తూ ‘‘ఉట్టికెగురలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు’’ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హేళన చేసి మాట్లాడారని మండిపడ్డారు. తాము ఉట్టికే కాదు.. అన్నింటా కేంద్ర ప్రభుత్వం కన్నా ఆకాశమంత ఎత్తులో ఉన్నామని చెప్పారు. తెలంగాణకు బీఆర్‌‌‌‌ఎస్సే శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం నిబంధనల పేరుతో అప్పులు రాకుండా చేయడంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు టైంకు జీతాలివ్వలేకపోతున్నామని చెప్పారు. శాలరీలు కొంత లేట్‌‌‌‌ అయినా.. దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా ఇక్కడి వాళ్ల జీతాలే ఎక్కువని తెలిపారు. జీతాల్లో వ్యత్యాసంపై త్వరలో వైట్ పేపర్​ విడుదల చేస్తామన్నారు. కరీంనగర్‌‌‌‌ సభలో నడ్డా ప్రాస కోసం పాకులాడారని విమర్శించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు వీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అంటే.. తమకు తాముగా స్వచ్ఛంద పదవీ విరమణ చేయడమని గుర్తు చేశారు. ఈ లెక్కన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించలేమని నడ్డా ఒప్పుకున్నారన్నారు.

ఎంత బ్లాక్​ మనీ తీసుకొచ్చిన్రు

కోట్లాది కొలువులు.. లక్షలాది రూపాయలు అకౌంట్లలో వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కేంద్రాన్ని హరీశ్​ప్రశ్నించారు. ‘‘దేశం నుంచి ఎంత బ్లాక్‌‌‌‌ మనీ విదేశాలకు వెళ్లింది.. అక్కడి నుంచి ఎంత తీసుకొచ్చారనే దానిపై వైట్​పేపర్ రిలీజ్ చేయడానికి సిద్ధమా?’’ అని హరీశ్​ సవాల్‌‌‌‌ విసిరారు. నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్‌‌‌‌ప్రదేశ్​లోనే ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక బొక్కబోర్లా పడ్డారని, ఇంటనే గెల్వని నడ్డా.. సాలు దొర.. సెలవు దొర అని చిల్లర మాటలు మాట్లాడుతారా? అని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేయలేదు గనుకే కరీంనగర్‌‌‌‌ సభలో సొల్లు పురాణం.. సినిమా డైలాగులతో సరిపెట్టారని విమర్శించారు. రైతుబంధు, మిషన్‌‌‌‌ భగీరథ, మిషన్‌‌‌‌ కాకతీయ సహా తెలంగాణ అమలు చేస్తోన్న ఎన్నో పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. సెప్టెంబర్‌‌‌‌ 17ను తాము అధికారికంగా నిర్వహించిన విషయం నడ్డాకు తెలీదా? అని ప్రశ్నించారు. ఒవైసీకి భయపడి చేయడం లేదంటూ కరీంనగర్ సభలో నడ్డా పాత స్క్రిప్ట్‌‌‌‌ చదివారని విమర్శించారు.   

హిందీపై నిర్మలా మాటలు సరికావు

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌ కమ్‌‌‌‌జోర్‌‌‌‌ హిందీ అంటూ హేళనగా మాట్లాడారని హరీశ్ అన్నారు. ‘‘హమారా హిందీ కంజోర్ హోగా.. మగర్ హం కామ్ దార్ హై.. ఇమాం దార్ హై... బీజేపీ వాలే కంజోర్ హై.. దేశ్ కో కంజోర్ బనా దియే..’’ అంటూ మండిపడ్డారు. నెలకు రూ.లక్ష కోట్ల అప్పులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ అప్పుల గురించి విమర్శలు చేస్తున్నదన్నారు. స్టేట్‌‌‌‌ ఓన్‌‌‌‌ రెవెన్యూలో దేశంలోనే తెలంగాణ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌గా ఉందన్నారు. జీఎస్టీ సెస్‌‌‌‌ తక్కువ తీసుకున్నదే తెలంగాణ అని తెలిపారు. గుజరాత్‌‌‌‌కు ఇచ్చిన నిధులపై కేంద్రం వైట్​పేపర్​ రిలీజ్ చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌‌‌‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌‌‌‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి పాల్గొన్నారు.