
- వచ్చే నెల నుంచే అభయహస్తం డబ్బులు : హరీశ్
చేర్యాల/కోహెడ (హుస్నాబాద్), వెలుగు : అభయహస్తం కింద డబ్బులు చెల్లించిన మహిళలకు మిత్తితో సహా ఇస్తామని, వచ్చే నెల నుంచి చెల్లిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సొంత జాగలో ఇండ్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు సాయం చేస్తామని, 57 ఏండ్లు నిండినోళ్లందరికీ పింఛను ఇస్తామని అన్నారు. 6 నెలల్లో 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని కొండాపూర్, మద్దూరు మండలంలోని నర్సాయపల్లి, చేర్యాల మున్సిపల్ కేంద్రం, ముస్త్యాల గ్రామం, అక్కన్నపేట మండలం రామవరం గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నర్సాయపల్లి, రామవరం ఊర్లలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సర్కారు దవాఖానకు రాను బిడ్డో అని అనేవాళ్లని.. కానీ, ఇప్పుడు సర్కారు బడులు, దవాఖాన్లకు క్రేజ్ పెరిగిందని చెప్పారు. మంత్రి పర్యటన సందర్భంగా దూల్మిట్ట మండలంలోని కూటిగల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలను గ్రామస్తులు చించేశారు. సీపీఐ, కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాగా, ఈ నెల 12న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహిస్తామని హరీశ్ చెప్పారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే కాలంతో పని లేకుండా హుస్నాబాద్ మెట్ట ప్రాంతం గోదావరి జలాలతో పచ్చబడుతుందని, నిర్వాసితులు సహకరించాలని కోరారు. రామవరం గ్రామంలో పీహెచ్సీని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్తో కలిసి ప్రారంభించారు.