
జాబుల భర్తీపై రిటైర్ మెంట్
ఏజ్ పెంపు ఎఫెక్ట్ ఉండదు
మాజీ ఎమ్మెల్యే లకు
పెన్షన్, వైద్య ఖర్చుల పెంపు
బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్ రావు.. అసెంబ్లీ ఆమోదం
హైదరాబాద్, వెలుగు:త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. రిటైర్ మెంట్ ఏజ్ పెంపుతో ఖాళీల భర్తీపై ఎలాంటి ప్రభావం పడదని చెప్పారు. ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇస్తూ, కింది స్థాయి ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ పెంపు, మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ , వైద్య ఖర్చుల పెంపు సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గురువారం క్వశ్చన్ అవర్ తరువాత హరీశ్ రావు ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులపై మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగస్తుల రిటైర్ మెంట్ ఏజ్ 58 ఏండ్లు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్‌కు 60, మెడికల్ కాలేజ్ టీచింగ్ స్టాఫ్‌కు 65, జ్యుడీషియరీ స్టాఫ్ కు 60 ఏండ్లు ఉందని గుర్తు చేశారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 60, 62 సంవత్సరాల వరకు పదవీవిరమణ వయసు అమలులో ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను 61 ఏండ్లకు
పెంచుతున్నామన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు హాస్పిటల్ కు వెళ్లినపుడు ట్రీట్ మెంట్ కు బిల్లులు చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, వారి భార్యలు లేదా భర్తలకు ట్రీట్ మెంట్ కు ప్రభుత్వం చెల్లించే ఖర్చులను రూ.లక్ష నుంచి రూ.10లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ అప్పర్ సీలింగ్ రూ.70 వేల వరకు పెంచుతున్నట్లు ఈ బిల్లులో పెట్టామని హరీశ్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతున్నారని, పెన్షన్ పెంచాలని పలుసార్లు సీఎం కేసీఆర్ ను కలిసి కోరారని గుర్తు చేశారు. ఇటీవల పీఆర్సీ కమిషన్ కూడా రిటైర్ మెంట్ ఏజ్ పెంచాలని రెకమెండ్ చేసిందని, ఈ విషయమై అన్ని ఉద్యోగ సంఘాల సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. పెరిగిన ఆరోగ్య ప్రమాణాలు రీత్యా వారి పదవీ విరమణ వయసు పెంచామని, సీనియర్ ఉద్యోగులకు టాలెంట్ ఎక్కువ ఉంటుందని, రాష్ట్రానికి వారి సేవలు అవసరమన్నారు.
ఈటలకు థ్యాంక్స్ చెప్పిన మాజీ ఎమ్మెల్యేలు
అసెంబ్లీ లో మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి మాజీ ఎమ్మెల్యేలు థ్యాంక్స్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలకు వైద్య ఖర్చులు, పెన్షన్లు పెంచేందుకు చొరవ తీసుకున్నారన్నారు. రాజేశం గౌడ్, ఆంజనేయులు, లింగయ్య, రామకృష్ణ రెడ్డి, దేవయ్య పాల్గొన్నారు.