ధరణి పోర్టల్​ దేశానికే ఆదర్శం  : మంత్రి హరీశ్​ రావు

ధరణి పోర్టల్​ దేశానికే ఆదర్శం  : మంత్రి హరీశ్​ రావు

కామారెడ్డి : ధరణి పోర్టల్​ వల్ల రూపాయి కూడా లంచం లేకుండా పట్టా పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొంతమంది మూర్ఖులు ధరణి  గురించి తెలుసుకోకుండా కామెంట్స్​ చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి వల్ల అవినీతి తగ్గడంతో పాటు పారదర్శకత పెరిగి వేగవంతమైన పాలన అందుతోందన్నారు. కామారెడ్డి జిల్లాలో డోంగ్లీ మండలం ఏర్పాటుతో స్థానికుల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని, ఆ కలను నిజం చేసింది సీఎం కేసీఆరేనని తెలిపారు. డోంగ్లీలో కొత్త మండల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి హరీశ్​ రావు మాట్లాడారు. త్వరలో గ్రామగ్రామాన సదస్సులను నిర్వహించి  రెవెన్యూ  సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి ధరణి పోర్టల్​ అమలు తీరు గురించి తెలుసుకొని వెళ్తున్నారని ఆయన చెప్పారు. టీఆర్​ఎస్​ వచ్చాకే రాష్ట్రంలో నీళ్ల బాధలు పోయాయని తెలిపారు.

“దరఖాస్తు లేదు.. దస్త్రం లేదు.. పంటకాలం రాగానే మీ ఫోన్లు ట్రింగ్ ట్రింగ్ మోగుతున్నాయి.. అకౌంట్లలో రైతుబంధు పైసలు పడుతున్నాయి’’ అని హరీశ్​ రావు గుర్తు చేశారు.  తెలంగాణ సంక్షేమ పాలనను చూసి మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సర్పంచులు వచ్చి తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. “విద్యుత్ సంస్కరణలు అమలు చేసి.. మోటార్లకు మీటర్లు పెడితే 30 వేల కోట్లు ఇస్తమని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెప్పింది. నా గొంతులో ప్రాణం ఉండగా మోటార్లకు మీటర్లు పెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు”అని హరీశ్​ రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా  960 డాక్టర్ల ఉద్యోగాలను ఈ వారంలో భర్తీ చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారికి హరీశ్​ రావు నివాళులర్పించారు.