
- నేను చెప్పిన అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది.. మీ పనులు చేసే బాధ్యత నాది
- సిద్దిపేట శుద్దిపేటగా మారింది
- సిద్ధిపేటలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ
- అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు
- చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కరే చెప్పిండు
సిధ్దిపేటలో అభివృద్ధి జరగాలంటే నాకు నమ్మకమైన వ్యక్తిని, నేను చెబితే వినేవాడిని, నా తోవలో నడిచేవాడిని గెలిపించాలి. ఎన్నికల సమయంలో ఎవరెవరో వచ్చి దండాలు పెడతారు. డబ్బులిస్తారు, మందు పంచుతారు. అలాంటి వాళ్లను గెలిపిస్తే అభివృద్ధి ఉండదు. అందుకే నాకు నమ్మకంగా ఉండేటోన్ని, చెబితే వినేటోన్ని అభ్యర్థిగా పెడతా. నా తోవలో, నా చేయి మీద నుంచి నడిచేవాన్ని గెలిపించే బాధ్యత మీది.. మీ పనులు చేసే బాధ్యత నాది’ అని ఆర్థికమంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట పాత బస్టాండ్ కూడలిలోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆర్థికమంత్రి హరీష్ రావు నివాళులు అర్పించారు. కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది. సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే. అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నాం. ఈ సారి అసెంబ్లీ బడ్జెట్‌లో దళిత్ ఎంపవర్‌మెంట్ కింద వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుచుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో దేశానికే ఆదర్శంగా తీర్చి దిద్దుకుంటున్నాం. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని ఆయన అన్నారు.
అనంతరం కొండా భూదేవి గార్డెన్స్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. పొన్నాల శివారు, నర్సాపూర్-గుండ్ల చెరువు, హరీష్ రావు నగర్, వికాస్ హైస్కూలు సమీప ప్రాంతాల్లోని కాలనీలకు చెందిన 472 మందికి నివాస యోగ్యమైన ఇళ్ల ధృవీకరణ పట్టాలను ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్‌తో కలిసి అందజేశారు. అక్కడ మాట్లాడుతూ.. ‘గరీబోళ్లు రూపాయిరూపాయి కూడబెట్టుకొని కొన్నేండ్ల కింద స్థలం కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఇండ్లకు పట్టాలు లేక ఇబ్బందిపడుతున్నారు. అందుకే అధికారులతో మాట్లాడి ఇండ్ల పట్టాలు పూర్తిగా మీ పేరు మీదే చేయించాను. ఇక నుంచి ఆ ఇండ్లపై పూర్తి హక్కులు మీవే. రోడ్లపై ఎక్కడా చెత్తవేయకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. సిద్ధిపేట అభివృద్ధిలో దూసుకెళ్తుంది. సిద్దిపేట శుద్దిపేటగా మారింది. సిద్ధిపేట ఒకప్పుడు పందులకు ప్రసిద్ధి.. ఇప్పుడు అభివృద్ధికి ప్రసిద్ది. కరోనా మీరనుకున్నంత సింపుల్‌గా లేదు. నేను వ్యాక్సిన్ వేయించుకున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ వేయించుకోండి. సిద్ధిపేట ఆస్పత్రిలో అన్ని వసతులు ఉన్నాయి. అక్కడికెళ్లి పరీక్షలు చేయించుకోండి. వ్యాక్సిన్ వేయించుకోండి. ఇక్కడ ఏ అభ్యర్థి పోటీచేసినా.. అభివృద్ధి చేసేవాళ్లని గెలిపించుకోవాలి. అందుకే నాకు నమ్మకంగా ఉండేటోన్ని, చెబితే వినేటోన్ని అభ్యర్థిగా పెడతా. నా తోవలో, నా చేయి మీద నుంచి నడిచేవాన్ని గెలిపించే బాధ్యత మీది.. మీ పనులు చేసే బాధ్యత నాది. ’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఆ తర్వాత సిద్దిపేట, గజ్వెల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ధర్మారెడ్డి పల్లిలో నూతనంగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని, ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్నాయంటే.. అవి అంబేద్కర్ విగ్రహాలేనని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.