ఢిల్లీలో మెచ్చుకుంటరు.. గల్లీలో తిడుతరా?: మంత్రి హరీశ్ రావు

ఢిల్లీలో మెచ్చుకుంటరు.. గల్లీలో తిడుతరా?: మంత్రి హరీశ్ రావు

మత్స్య సంపద అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు మంత్రి హరీశ్ రావు. ఆయన మే 7వ తేదీ ఆదివారం సిద్దిపేట జిల్లాలోని పి.వి.నరసిహావరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ భవన సముదాయనికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. రైతు ఏడ్చిన రాష్ట్రం ముందుకు పోదంటారు.. మూగజీవాలకు కూడా కేసీఆర్ నాయకత్వంలో విస్తృత సేవలు అందుతున్నాయన్నారు. పశు పక్షాదుల కోసం 1962 నెంబర్ కు ఫోన్ చేస్తే అంబులెన్స్ సేవలు అందుతున్నాయని హరీశ్ రావు చెప్పారు.

కేంద్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో మెచ్చుకుంటారు.. గల్లీలో తిడతారా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవార్డుల మీద అవార్డులు ఇస్తరు.. మళ్లీ వాళ్లే గల్లీలోకి వచ్చి తిడతారని విమర్శించారు హరీశ్ రావు. 1962 నెం. మనం అందుబాటులోకి తెస్తే.. దాన్ని నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారని వ్యాఖ్యనించారు. మిషన్ భగీరథ, రైతుబంధును కూడా నఖలు కొట్టి దేశమంతా అమలు చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ వాళ్లు పీవీకి ఘాట్ కట్టడానికి అనుమతి ఇయ్యలేదన్న హరీశ్..సీఎం కేసీఆర్ ఈ వైద్యశాలకు పీవీ పేరు పెట్టి వారి గౌరవాన్ని పెంచారన్నారు.

తెలంగాణలో కాళోజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ పేర్లతో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేసుకున్నారు మంత్రి హరీశ్ రావు. గత ప్రభుత్వాలు వీరిని పట్టించుకోలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిండు ఎండాకాలంలోనూ జలసిరి పెరిగి అలుగులు పారుతున్నాయని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 12460 మంది మత్స్య కారులకు కొత్తగా సభ్యత్వం వస్తున్నదని..3.70 లక్షల మందికి రెండో విడత గొర్ల పంపిణీ చేశామని చెప్పుకొచ్చారు. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీని ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి హరీశ్.. విద్యను సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.