
హైదరాబాద్, వెలుగు: తల్లీబిడ్డల క్షేమం కోసం ప్రభుత్వ దవాఖాన్లలో టిఫా స్కానింగ్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ నెల18న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు ఆస్పత్రుల్లో ఒకేసారి 56 టిఫా మిషన్లను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇకపై గర్భిణులు స్కానింగ్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గర్భంలోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు టిఫా స్కాన్ చేస్తారని వివరించారు. కంటి చికిత్సకు వినియోగించే 26 ఆపరేటింగ్ మైక్రోస్కోపులను కూడా ఈ నెల 18న ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.
సోమవారం హైదరాబాద్‌లోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో హెల్త్ ఆఫీసర్లతో మంత్రి రివ్యూ చేశారు. గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మల్కాజ్ గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని 32 ఆస్పత్రుల అప్ గ్రేడేషన్ పనులు, 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్ పనులను స్పీడప్ చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 41 బస్తీ దవాఖాన్ల పనులను డిసెంబర్ చివరి నాటికల్లా పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు.