ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సొంత స్థలం ఉండి..ఇళ్లు కట్టుకునే వాళ్లకు రూ.3 లక్షలు నెల రోజుల్లో ఇస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు.పెద్దవాగును కాళేశ్వరం జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. మొదటగా వాటర్ ట్యాంకు, గొర్రెల షెడ్ ను ప్రారంభోత్సవం చేశారు. షెడ్లు పొందిన లబ్ధిదారులకు కొత్త బట్టలను అందించారు. ఆ తర్వాత నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.

రూ.2 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కొత్తగా ప్రారంభించిన PHCలో కాన్పులు చేస్తారని అన్నారు. అలాగే మరో నూతన PHC భవనం కోసం రూ.2 కోట్లు మంజూరు చేశామన్నారు. ‘మీ దయ, కేసీఆర్ దయతో ఆరోగ్య మంత్రిని అయ్యాను’ అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వాగు మీద బ్రిడ్జ్ వేశామని.. నంగునూర్ నుంచి ఖాతా వరకు డబుల్ రోడ్డు వేసుకున్నామన్నారు. పెద్ద వాగు మీద 7 చెక్ డ్యామ్ లు నిర్మించామని తెలిపారు. ‘ఢిల్లీలో ఉన్న బీజేపీ వాళ్లకు వడ్లు కొనడం చేత కాదు. కానీ.. నూకలు బుక్కుమని అంటున్నారు. మన కేసీఆర్ బ్రహ్మాండంగా వడ్లు కొంటున్నారు’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.