గొర్రెల కోసం ప్రత్యేకంగా హాస్టల్.. మంత్రి హరీష్ ఆదేశం

గొర్రెల కోసం ప్రత్యేకంగా హాస్టల్.. మంత్రి హరీష్ ఆదేశం

గొర్రెల కోసం ఓ హాస్టల్ కట్టాలని, అందుకోసం మంచి స్థలాన్ని సేకరించి వెంకటాపూర్ గ్రామానికి ఇవ్వాలని సిద్దిపేట్ మండలం ఎమ్మార్వోని ఆదేశించారు మంత్రి హారీష్ రావు.  గొర్రెల కోసం ప్రత్యేకంగా ఓ హాస్టల్ ఉంటే గ్రామం శుభ్రంగా మారి రోగాలు దూరమవుతాయని గ్రామ ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మంత్రి సిద్ధిపేట జిల్లాలోని వెంకటాపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు.

రోగాలు, జబ్బులు లేని ఆరోగ్య వెంకటాపూర్, ఆరోగ్య సిద్ధిపేట నియోజకవర్గం, ఆరోగ్య తెలంగాణ కావాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉందని గ్రామ ప్రజలకు తెలిపారు. ప్రతీ ఇంటితో పాటు గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా నిలుపుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలదేనన్నారు. పనికి రాని చెత్త ఇంట్లో ఉంటే దోమలు పెరుగుతాయని, ఎప్పటికప్పుడు చెత్తను తొలగించుకోవాలన్నారు. ప్రతి ఇంటింటికీ త్వరలోనే రెండు చెత్త డబ్బాలు పంపిణీ చేయిస్తానని అన్నారు. రెండవ విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ఇళ్లలోంచి 100 ట్రాక్టర్లు చెత్త బయటకు వచ్చిందని, ఇదే పద్ధతిని నిరంతరం కొనసాగించాలని గ్రామస్తులను కోరారు మంత్రి.

గ్రామంలోని రజక సంఘం, కుమ్మరి సంఘ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం మరియు సీసీ రోడ్లు కోసం కొత్త బడ్జెట్ లో  నిధులు మంజూరు చేస్తానని హరీష్ రావు హామీనిచ్చారు. గతంలోనే విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేసుకున్నామని, స్మశాన వాటికలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈ నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి ప్రజలు సూచించారు. గ్రామంలో 2 పాత బావులు పూడ్చాలని గ్రామస్తులు కోరగా, యుద్ధప్రాతిపదికన పూడ్చాలని మంత్రి అధికారులని ఆదేశించారు.

వెయ్యి రూపాయల పింఛన్ ను 2వేలకి పెంచామని, రూ.50 వేల నుంచి రూ. 1,00,116 కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పేరిట ఇస్తున్నామని మంత్రి హరీష్ అన్నారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తెచ్చి పేదల ప్రభుత్వంగా మారిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యిందని, త్వరలోనే కాలువల ద్వారా ఈ వెంకటాపూర్ గ్రామానికి గోదావరి జలాలు రానున్నాయని., యాసంగి పంటకు నీరు అందుతుందని వెల్లడించారు. రైతులు సంప్రదాయేతర పంటల వైపు దృష్టి సారించాలని, అందరూ వరి పంట వేయొద్దని హరీష్ సూచించారు.  ఆరుతడి పంటలు వేయడం వల్ల  రెండవ పంట లాభదాయకంగా ఉంటుందని రైతులకు అవగాహన కల్పించారు హరీష్ రావు.