- హెల్త్ ఆఫీసర్లను ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు
- విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు హాస్పిటళ్లలో నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్లు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయని మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న హాస్పిటళ్లపై దృష్టి పెట్టాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన్లలో డెలివరీల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో జరిగే సిజేరియన్ డెలివరీలపై, హాస్పిటళ్ల వారీ సమీక్షతోపాటు డాక్టర్ వారీగా సమీక్ష చేయాలని చెప్పారు. ఆదివారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కమిషనర్ వాకాటి కరుణ, డీహెచ్ శ్రీనివాసరావుతో కలిసి హరీశ్‌రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని హాస్పిటళ్ల మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌కు రావాలె
హెల్త్ ఇండెక్స్‌లో ప్రస్తుతం దేశంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను ఫస్ట్ ప్లేస్‌కు తీసుకురావాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ పోటీతత్వంతో పని చేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. మంచి పనితీరు కనబర్చిన డీఎంహెచ్‌వోలు, పీహెచ్‌సీ డాక్టర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలకు ఈ నెల 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నగదు ప్రోత్సాహంతోపాటు సన్మానిస్తామని, ప్రతి విభాగంలో ముగ్గురిని ఎంపిక చేసి సన్మానిస్తామని చెప్పారు. అదే సమయంలో.. పని చేయని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి నెలా అన్ని పారామీటర్ల మీద సమీక్ష ఉంటుందని, ప్రతి ఒక్కరూ రిపోర్టులతో సిద్ధంగా ఉండాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలు ఎక్కువగా ఫీల్డ్ విజిట్స్ చేయాలని, పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీహెచ్ శ్రీనివాస రావు, కమిషనర్ వాకాటి కరుణ వారానికి ఓ జిల్లాకు వచ్చి సర్‌ప్రైజ్ విజిట్స్ చేస్తారని హెచ్చరించారు. పనిచేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని, ఇదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
