ఎమ్మెల్యేల కొనుగోళ్లతో సంబంధం లేకుంటే కోర్టుకెందుకు పోయారు?: మంత్రి హరీశ్ రావు​

ఎమ్మెల్యేల కొనుగోళ్లతో సంబంధం లేకుంటే కోర్టుకెందుకు పోయారు?: మంత్రి హరీశ్ రావు​
  • బీజేపీకి సీబీఐ జేబు సంస్థ.. దానిపై మాకెట్లా విశ్వాసం ఉంటది?
  • రాష్ట్రంలోనే అత్యధిక సంక్షేమ ఫలాలు మునుగోడు ప్రజలకు అందినయ్​

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేకుంటే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టుకెందుకు వెళ్లారని మంత్రి హరీశ్‌‌‌‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ కృష్ణా, గోదావరి నీళ్లను లిఫ్ట్‌‌‌‌ చేస్తుంటే, బీజేపీ నీతిజాతి లేకుండా సంపాదించిన పైసలతో ఎమ్మెల్యేలను లిఫ్ట్‌‌‌‌ చేస్తున్నదని ఆయన ఆరోపించారు. సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌లో హరీశ్​రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పోలీసులపై బీజేపీకి నమ్మకం లేనప్పుడు సీబీఐపై తమకెలా ఉంటుందని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ జేబు సంస్థలుగా ఉపయోగించుకుంటున్నదని, ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. గుజరాత్‌‌‌‌లో కేబుల్‌‌‌‌ బ్రిడ్జి కూలిపోయి ప్రాణనష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘‘గతంలో ఇలాగే బెంగాల్‌‌‌‌లో బ్రిడ్జి కూలిపోతే.. ఆ బ్రిడ్జి కూలినట్టే అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేవుడు సిగ్నల్‌‌‌‌ ఇచ్చినట్టు అని ప్రధాని మోడీ అన్నరు. ఇప్పుడు గుజరాత్‌‌‌‌లోనూ అట్లనే  మాట్లాడుతరా?”అని ప్రశ్నించారు. బీజేపీ  దొంగ మాటలు చెప్తున్నదని, మునుగోడులో ఆ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. 

చిల్లర ఆరోపణలు చేస్తున్నరు
‘‘వ్యవసాయ మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పలేదంటూ కిషన్ రెడ్డి అబద్దాలు చెప్తున్నరు. మోటార్లకు మీటర్లు పెడితేనే ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌బీఎం పరిధిని 0.5 శాతం పెంచుతమని కేంద్ర ఆర్థిక శాఖ, రూరల్‌‌‌‌ ఎలక్ట్రిఫికేషన్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ లేఖ రాసిన విషయం కేంద్ర మంత్రిగా కిషన్‌‌‌‌ రెడ్డికి తెలియదా?” అని హరీశ్​రావు ప్రశ్నించారు. తాను ఆ సర్క్యులర్‌‌‌‌ను చూపిస్తున్నానని.. కిషన్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్‌‌‌‌ తల ఎక్కడ పెట్టుకుంటారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 65 లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్‌‌‌‌ తెగేసి చెప్పారని, ఐదేండ్లలో రూ. 30 వేల కోట్ల అప్పు వదులుకున్నారని ఆయన అన్నారు. కిషన్‌‌‌‌ రెడ్డికి చేతనైతే రెండేండ్లలో రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్ల అప్పు ఇప్పించాలని సవాల్‌‌‌‌ చేశారు. ‘‘చేనేతపై జీఎస్టీ వేసే ఫైల్‌‌‌‌పై నేను సంతకం చేసినట్లు చిల్లర ఆరోపణలు చేస్తున్నరు. మొదటి నుంచి చేనేతపై జీఎస్టీని మేం వ్యతిరేకిస్తున్నం. చేనేతపై 2017లోనే జీఎస్టీ వేసిన్రు. అప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నది ఈటల రాజేందర్‌‌‌‌. ఆయన కూడా చేనేతపై జీఎస్టీ వేయొద్దని 2017 జులై 1న జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌ చేసిన్రు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన కిషన్‌‌‌‌ రెడ్డి, సంజయ్‌‌‌‌ క్షమాపణ చెప్పాలి” అని హరీశ్​ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్‌‌‌‌ నిర్మూలనకు కేంద్రం రూ.800 కోట్లు ఇచ్చిందని కిషన్‌‌‌‌ రెడ్డి చెప్తున్నారని, నీతి ఆయోగ్‌‌‌‌ ఈ పథకానికి రూ.19,200 కోట్లు ఇవ్వాలని రికమండ్‌‌‌‌ చేసినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. కృష్ణా జలాల్లో వాటా కోసం కేంద్రం పిలిచినా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లలేదని కిషన్‌‌‌‌ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే కృష్ణా నీళ్లల్లో వాటా తేల్చాలని కోరుతూ సీఎం లేఖ రాశారని, ఇప్పటి వరకు 20 లేఖలు రాశామని చెప్పారు.  

కేసీఆర్​ సభ సక్సెస్​తో గెలుపు ఖాయమైంది 
‘‘కేసీఆర్ సభ సక్సెస్‌‌‌‌తోనే మునుగోడులో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గెలుపు ఖాయమైంది. ఆ సభను చూసి బీజేపీ నేతల్లో అసహనం పెరిగింది. ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు. బీజేపీ డీఎన్‌‌‌‌ఏలోనే అబద్ధాలు, మాయ మాటలు ఉన్నయ్” అని హరీశ్​ రావు అన్నారు. గల్లీ నాయకులకన్నా అధ్వాన్నంగా కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌‌‌ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోనే అత్యధిక సంక్షేమ ఫలాలు మునుగోడు ప్రజలకు అందాయని తెలిపారు. తాము చెప్పేది నిజం కాకపోతే ప్రజలు తమకు ఓట్లే వేయరని అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నామని, బీజేపీ ప్రలోభాలకు గురి చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటుందని దుయ్యబట్టారు.