మాకు ఓటేస్తామని హామీ ఇస్తే.. మీ ఊరిని దత్తత తీసుకుంటా

V6 Velugu Posted on Oct 17, 2021

కరీంనగర్: వీణవంక మండలం మామిడాల పల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున ఆయనతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే.. మీ ఊరిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. 

‘మాజీ మంత్రి, గొప్ప లీడర్ ముద్దసాని దామోదర్ రెడ్డి ఊరికి రావడం సంతోషంగా ఉంది. అలాంటి లీడర్ మీద ఈటల రాజేందర్‎ను కేసీఆర్ పోటీకి దించి గెలిపించారు. ఈటల రాజేందర్ తనకేదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాడు. ముద్దసాని దామోదర్ రెడ్డి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా.. కత్తికి ఎదురులేని నాయకునిగా ఉండేవాడు. అప్పట్లో ఈటల ఎవరికి కనీసం పరిచయం కూడా లేదు. ఆనాడు కారు గుర్తును, గులాబీ జెండాను చూసి మాత్రమే ఈటలను గెలిపించారు. తెలంగాణ రావాలనే.. ముద్దసాని దామోదర్ రెడ్డిని కాదని కారు గుర్తుకు ఓటేశారు. ఎవరికీ తెలియని నిన్ను పెంచి పెద్ద చేసిన కేసీఆర్‎ను పట్టుకుని ఘోరీ కడుతానని, అగ్గిపెడతానని మాట్లాడుతున్నాడు. లోకం మెచ్చిన కల్యాణ లక్ష్మిని ఈటల దండుగ అంటున్నాడు. తన స్వార్థం కోసమే ఈటల రాజీనామా చేశారు తప్ప... హుజురాబాద్ అభివృద్ధి కోసం కాదు. రైతుబంధు దండుగ అంటున్న ఈటల రాజేందర్ మాత్రం.. తన భూమికి పదిన్నర లక్షల రైతుబంధు తీసుకున్నాడు. రైతుబంధు దండుగ అన్న ఈటల మనకు దండుగ అని చెప్పాలి. 

రైతుకు మేలు చేసింది టీఆర్ఎస్ అయితే.. భారం వేసింది బీజేపీ. అలాంటి పార్టీకి ఎందుకు ఓటేయాలి?  రైతుల ఆదాయం పెరిగి కారు కొనుక్కోవాలని కేసీఆర్ ఆలోచిస్తుంటే.. బీజేపీ మాత్రం రైతులపై కారు ఎక్కిస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే సిలిండర్ ధర వెయ్యి రూపాయలైంది. కానీ ఈటల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం 291 రూపాయలు పన్ను వేస్తోందంటున్నాడు. దీనిపై చర్చకు రమ్మంటే రావడం లేదు. నేను దొంగచెక్కులిచ్చానని ఈటల ప్రచారం చేస్తున్నాడు. కానీ ఆడబిడ్డలు మాత్రం ఇప్పటికే చెక్కులు విడిపించుకున్నామని చెబుతున్నారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న హామీ నిలబెట్టుకుంటాం. వచ్చే మార్చి నాటికి మిత్తితో సహా రుణమాఫీ చేసి తీరుతాం. వడ్ల కొనుగోలు చేసి తీరుతాం. ఇప్పటికే వీణవంకలో కొనుగోలు మొదలు పెట్టాం. బీజేపీ అనే మోరీలో రాజేందర్ పడ్డాడు. పడ్డాక బురద అంటకుండా ఉంటదా? బీజేపీ చేసే తప్పులకు ఈటల కూడా బాధ్యత వహించాలి కదా. మీ ఒక్క మామిడాల పల్లికే 2.5కోట్ల పనులు సాంక్షన్ చేశాం. ఇంకా మిగిలితే పూర్తి చేస్తాం. పదిహేను రోజులకోసారి వచ్చి గెల్లు శ్రీనివాస్‎తో కలిసి పనిచేస్తా. సొంతజాగాల్లో ఇండ్లు కట్టిస్తామని ఇప్పిటికే అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. మంత్రులందరూ తమ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించినా.. ఈటల రాజేందర్ మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పటికే మంజూరైన నాలుగువేల ఇండ్లతో పాటు.. మరో ఐదు వేల ఇండ్లు మంజూరు చేయిస్తా. 

యవ్వారం నడవాలంటే ప్రభుత్వంలో ఉన్నోళ్లనే  గెలిపించాలి

 దామోదర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగినట్లే.. ఇకపై కూడా ఊరిలో పనులు చేసుకుందాం. దళితబంధు రాదని ఈటల రాజేందర్ చెబుతున్నాడు. మరీ నీవు ఇస్తావా? గతంలో పదిలక్షలు కాదు.. 50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ అన్నాడు. మేము పదిస్తాం.. మీరు 40 లక్షలు తెమ్మంటే అప్పట్నుంచి బండి సంజయ్ మాట్లాడటం లేదు. వాళ్లు ఇవ్వరట కానీ.. పుల్లలు పెడుతారట. తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అంటూ 11 రోజులు ఆమరణ దీక్ష చేసి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా? అలాంటి కేసీఆర్ మాట తప్పుతాడా? గౌడ సోదరులకు కూడా లూనాలు ఇస్తామని ఇప్పటికే చెప్పాం. బీసీల్లోని పేదలకు కూడా సాయం చేస్తానని కేసీఆర్ చెప్పారు. కల్యాణ లక్ష్మి మొదట్లో దళిత పేద ఆడపిల్లలకు ఇచ్చి.. తర్వాత అందరికీ ఇచ్చారు. ఇదే విధంగా దళితబంధులాంటి పథకం మిగతా కులాలకు కూడా ఇస్తారు. 
రోజుకో కేంద్ర మంత్రిని హుజురాబాద్‎కు తెస్తున్నారు. వచ్చినోళ్లు సిలిండర్ ధర 500కు తగ్గిస్తామని చెప్పి ఓటు అడగాలి. ఆంధ్రా సీఎం జగన్ ఇప్పటికే బావుల దగ్గర మీటర్లు పెట్టినా.. కేసీఆర్ మాత్రం పెట్టడం లేదు. 

కొత్త వ్యవసాయ చట్టం ఉంటదో.. పోతదో చెప్పిన తర్వాతే ఈటల రాజేందర్  ఓట్లు అడగాలి. బురద పార్టీలో చేరి.. ఆయన అంటించుకున్నదే కాకుండా.. మనందరికీ బురద అంటిద్దామని చూస్తున్నాడు. కేసీఆర్ ఇంత మంచిగా పనిచేస్తుంటే.. ఆ బురద మనకెందుకు? గెల్లును గెలిపించండి.. కలెక్టర్లను, ఇంజినీర్లను గ్రామపంచాయితీ దగ్గర నిలబెట్టి, ఉరికించి పనిచేయించే బాధ్యత నాది. బ్యాలెట్ పేపర్లో రెండో నెంబరు కారు గుర్తు.. ఒకటో నెంబరు వేరేవాళ్లది. ముసలోళ్లు ఒకటికి రెండుసార్లు చూసి ఓటేయండి. నేను తిట్టాలనుకుంటే ఈటల రాజేందర్‎ను రేపటిదాకా తిడుతా.. నాకు కూడా నోరుంది, నాలుకుంది. ఈటల రాజేందర్ నన్ను తిట్టేది తిడుతున్నడు. సెంటిమెంట్ డైలాగులు కడపు నింపవు. మామిడాల పల్లిలో బ్యాంకు పెట్టిస్తా. గతంలో పెద్దనోట్లు రద్దు చేసి.. మనోళ్లు దాచుకున్న చిల్లరనోట్లు తీసుకున్నారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి మనిషికి పదిహేను లక్షలిస్తామన్నారు. ఇప్పటివరకు ఇవ్వనేలేదు’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Tagged Telangana, CM KCR, Harish rao, Eatala Rajender, Minister Harishrao, Huzurabad, Huzurabad By election

Latest Videos

Subscribe Now

More News