
- ఆన్లైన్లో బోనం.. పోస్టులో ప్రసాదం
- ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఆలయాల్లో ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆన్ లైన్ లోనూ బోనాలు సమర్పించేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్ లో ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఆన్ లైన్ సేవలను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్ర నామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారన్నారు.
ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం ప్రసాదంలా పంపిణీ చేస్తారని, వాటిని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చన్నారు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు -కుంకుమ పంపిస్తారని చెప్పారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ఆన్ లైన్లో బోనం సమర్పించే భక్తులకు జులై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. టీ యాప్ ఫోలియో, మీ సేవా, ఆలయ వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశ, విదేశీ భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
దేశీయ సేవలకు గానూ రూ.300, అంతర్జాతీయ సేవలకు గానూ రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశంలోని భక్తుల ఇంటికి చేరవేస్తారని వెల్లడించారు.