బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

బీజేపీ నేత బండి సంజయ్ అరెస్టుపై తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.  పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ నాయకుల పాత్ర ఉండటం దురదృష్టకరం అని అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికినా కూడా బీజేపీ నాయకులు బండిని సమర్థించడం సిగ్గు చేటు అన్నారు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లి మరీ దొంగను రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మీడియాతో ఆయన మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. 

‘‘ క్షుద్ర రాజకీయాల క్రీడకు బీజేపీ తెరలేపింది. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ ట్రాప్ లో పడొద్దు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీ ని గ్రామ గ్రామాన నిలదీయాలి. యువతను బీఆర్ఎస్ నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోంది.  ఈ దుర్మార్గాలను ప్రజలు తిప్పికొట్టాలి.  తక్షణమే బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి  నుంచి సస్పెండ్ చేయాలి. ’’ అంటూ ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా పోలీసులు సంజయ్ ను అరెస్టు చేయడంపై బీజేపీ నేతలు, కార్యక్తలు భగ్గుమంటున్నారు. ఇదిలా ఉంటే యాదాద్రి బొమ్మల రామారం జైలులో ఉన్న బండి సంజయ్ ను వరంగల్ జైలుకు తరలించే క్రమంలో హైడ్రామా నడిచింది. తొలుత భువనగిరి కోర్టుకు తరలిస్తామని సమాచారం ఇచ్చి తర్వాత మీడియా కంట పడకుండా బండి సంజయ్ ను వరంగల్ వైపు తరలించారు.