అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి జగదీష్ రెడ్డి

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి జగదీష్ రెడ్డి

అభివృద్ధిలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలో నూతన బస్ స్టేషన్ ను ఆయన ఇవాళ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పాలనను, కేంద్ర ప్రభుత్వ పాలనను దేశ ప్రజలు బేరిజ్ చేసుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పనితనం గుర్తించారు కాబట్టే ప్రజలంతా ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కొనియాడారు. యాదగిరిగుట్ల ఆలయానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్.. చరిత్రలో నిలిచారని మంత్రి తెలిపారు.

యాదగిరిగుట్టలో భక్తులకు అన్ని సౌకర్యాలతో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నూతన బస్ స్టాండ్ ను నిర్మించామని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల భక్తులకు సౌకర్యం కోసం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్టను ముఖ్య మంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. యాదగిరిగుట్టకు రోజుకు 20 వేల మంది, వారాంతంలో 35 వేల మంది భక్తులు వస్తున్నారని వెల్లడించారు. రానున్న కాలంలో రోజుకు లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్లుగా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.