- షబ్బీర్‌అలీయే పెద్ద అవినీతి పరుడు
- కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి
కామారెడ్డి, వెలుగు : అవినీతి పరులేవరో తేల్చుకుందామని, షబ్బీర్‌అలీయే పెద్ద అవినీతి పరుడని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడారు. షబ్బీర్‌అలీ కామారెడ్డికి పట్టిన శని అని విమర్శించారు. ఎమ్మెల్సీగా విత్ డ్రా చేసుకోవటానికి నేను పైసలు తీసుకున్నట్లు షబ్బీర్‌అలీ ఆరోపణలు చేశారని దీన్ని నిరూపించాలన్నారు. తాను దర్గాకు వస్తానని షబ్బీర్‌అలీ కూడా తన కుటుంబ సభ్యులతో అక్కడకు రావాలన్నారు. ఎమ్మెల్సీగా అప్పుడు నేను విత్‌డ్రా చేసుకున్నప్పుడు పైసలు తీసుకున్నట్లు నిరూపించాలన్నారు. దీనిపై చర్చించేందుకు కేసీఆర్, కేటీఆర్ వద్దకైనా వెళ్దామన్నారు.
అప్పుడు ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు తన వద్ద ఖర్చుల నిమిత్తం షబ్బీర్ అలీ పీఏకు తానే రూ. 5 లక్షలు ఇచ్చానన్నారు. కామారెడ్డి డిగ్రీ కాలేజీ భూములు తాను అమ్నుకున్నట్లు కానీ, కాలేజీ ఆస్తులకు తాము ఏమైనా పైసలు తిన్నట్లు నిరూపించాలన్నారు. సమితి ప్రెసిడెంట్‌గా ఉన్న తమ తండ్రి కేపీ రాజిరెడ్డి మరి కొంత మందిపెద్దలతో కలిసి కాలేజీ నిర్మాణం చేయించారన్నారు.
తన తండ్రి హయాంలోనే మార్కెట్ ఏర్పాటు జరిగిందన్నారు. రికార్డులు, అమౌంట్ డిపాజిట్‌కు సంబంధించిన పేపర్లు ఉంటే కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ప్రతినిధుల సమక్షంలోనే అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు అప్పగించినట్లు చెప్పారు. తన తండ్రీ దగ్గర షబ్బీర్‌అలీ శిష్యుడు అన్నారు. 1989లో షబ్బీర్‌అలీ ఎమ్మెల్యే కాక ముందు ఆయన ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో చెప్పాలన్నారు.
ఆయన దొంగ సారా, దొంగ కలప వ్యాపారం చేశారని ఆరోపించారు. కామారెడ్డిలో చాలా మంది భూములను కబ్జా చేశారని ఆరోపించారు. మాజీ జడ్పీ చైర్మన్ కేఆర్ రాజిరెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులకు సంబంధించి పాస్ బుక్కులు ఇవ్వనియ్యకుండా ఎంత ఇబ్బంది పెట్టించారో అందరికీ తెలుసునన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ భూములను షబ్బీర్‌అలీ, ఈయన తమ్ముడు, మరికొంత మంది తమ పేరిట తక్కువకు కొని ఎక్కువ రికార్డులు చేయించుకున్నారన్నారు.
తాను చేసే ప్రతి ఆరోపణకు ఆధారాలు ఉన్నాయన్నారు. కామారెడ్డి ప్రజలు షబ్బీర్‌అలీని 5 సార్లు ఓడించారన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని తాము కోరగా వాళ్లు ఇవ్వలేదన్నారు. రూ.3 కోట్లకు డీల్ కుదుర్చుకొని చైర్పర్సన్ పదవి ఇచ్చారని ఆరోపించారు. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇక అవినీతిని సహించే ప్రసక్తే లేదన్నారు. కొత్తగా ఎన్నికైన చైర్పర్సన్ ఉమారాణి, వైస్ చైర్పర్సన్ గోదావరి ప్రజలకు మంచి పాలన, అవినీతి రహిత పాలన అందిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఇప్పటి వరకు ఒక రమణరెడ్డి రేపటి నుంచి మరో రమణరెడ్డిని చూస్తారన్నారు. సమావేశంలో ఇటీవల గెలిచిన ఆ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.
