బాన్సువాడ, వెలుగు : బాన్సువాడ పట్టణంలో మంగళవారం స్మార్ట్ బజార్ వద్ద కారు అద్దాలు పగులగొట్టి అందులో నుంచి రూ. 8 లక్షలు చోరీ చేశారని డీఎస్పీ విట్టల్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన ఇబతి యాదవ్ రావు తన బంధువు మాధవరావుతో కలిసి బాన్సువాడ ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేశారు. బ్యాగులో డబ్బులు పెట్టుకొని రిలయన్స్ మార్ట్ ఆవరణలో కారును పార్కు చేసి లోపలికి వెళ్లారు.
షాపింగ్ చేసి బయటకు వచ్చేసరికి కారు ఎడమవైపు వెనుక డోర్ గ్లాస్ పగలగొట్టి డబ్బులు ఉన్న బ్యాగును చోరీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తూ చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
