నిజామాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ పాలనలో కుటుంబీకుల జోక్యం లేకుండా మహిళా సర్పంచ్‌లు పాలన సాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్‌లకు ఐదు రోజుల ట్రైనింగ్‌ను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. పంచాయతీ చట్టాలపై అవగాహన పెంచుకొని సొంత నిర్ణయాలతో ఫస్ట్ సిటిజన్ గౌరవం పొందాలని, ఇతరుల జోక్యంతో చులకనవడమే కాకుండా నేర్చుకోవాలనే అభిరుచి కోల్పోతారన్నారు.
తాగునీరు, శానిటేషన్, వీధి రోడ్లు, విద్య, వైద్యం తదితర అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. హాస్టల్స్, కాస్తూర్బా, రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేసి లోటుపాట్లు ఉంటే ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గవర్నమెంట్ భూములు ఆక్రమణనకు గురికాకుండా చూడడం, కొత్త ఆలోచనలతో పల్లె ప్రగతికి పాటుపడాలన్నారు. ఈ విషయంలో తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రతి ఏటా పది మంది ఉత్తమ మహిళా సర్పంచ్‌లను గుర్తించి సన్మానించడమే కాకుండా ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన గంగాదేవీపల్లి టూర్‌కు పంపుతామన్నారు. డీపీవో శ్రీనివాస్‌రావు, ఏవో రాజాబాబు, మాస్టర్ ట్రైనర్లు ఉన్నారు.
