ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు నిర్వహించాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, హాస్టల్స్ లో ఆహార నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేసేలా తనిఖీలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో మంగళవారం గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బ్రహ్మాజీ జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీలు, జారీ చేసిన లైసెన్సులు, తీసుకున్న చర్యలపై నివేదికను సమర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వారానికి కనీసం మూడు రోజులు తనిఖీలు నిర్వహించాలన్నారు.

ప్రతి వారాంతంలో తనిఖీల వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు ఉన్నాయో లేదా చెక్ చేయాలన్నారు. హోటల్స్, హాస్టల్స్​లోని తాగునీరు, ఆర్వో వాటర్ ప్లాంట్ల పనితీరును తరచూ తనిఖీ చేయాలని, అవసరమైతే నీటి నమూనాలను ల్యాబ్ కు పంపి టెస్టులు చేయాలన్నారు. ఆహార పదార్థాలు విక్రయించే స్ట్రీట్ వెండర్లు తప్పనిసరిగా అనుమతులు, లైసెన్సులు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆహార నాణ్యతపై రాజీ ఉండకూడదని, నిబంధనలు పాటించని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. డీఎంహెచ్​వో అప్పయ్య, డీఈవో గిరిరాజ్ గౌడ్, డీసీఎస్వో వాజిద్ అలీ, డీపీవో లక్ష్మీరమాకాంత్ పాల్గొన్నారు.