భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు : మంత్రి జగదీశ్​రెడ్డి

భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు : మంత్రి జగదీశ్​రెడ్డి

భగీరథ నీళ్లతో బట్టలుతికి.. బర్లు కడిగి.. నీళ్లు సాల్తలేవంటున్నరు
బయట డబ్బా నీళ్లు కొనుక్కొని తాగుతున్నరు
జనంపై మంత్రి జగదీశ్​ రెడ్డి ఫైర్​
ఎస్సారెస్పీని మర్చిపోవాలని, ఇక అంతా  కాళేశ్వరమేనని కామెంట్​

యాదాద్రి, వెలుగు : ‘‘మిషన్​ భగీరథ వాటర్​తో బట్టలుతికి.. బర్లు కడుగుతున్నరు.. అన్ని అవసరాలకు వాడుకుంటున్నరు.. మళ్లా నీళ్లు సరిపోతలేవని అంటున్నరు.. తాగడానికేమో డబ్బా నీళ్లు కొనుక్కుంటున్నరు..’’ అని జనంపై మంత్రి జగదీశ్​రెడ్డి గరమయ్యారు. విలువైన భగీరథ నీళ్లతో ప్రజలు సంపులు, ట్యాంకులు నింపుకుంటున్నారని, దీంతో నీళ్లు చాలక కొన్ని చోట్ల భగీరథ నీళ్లలో బోరు వాటర్​ కలిపి సప్లయ్​ చేయాల్సి వస్తున్నదని చెప్పారు.  

ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి భగీరథ నీళ్లను సప్లయ్​ చేస్తుంటే  జనం మాత్రం బయట డబ్బా వాటర్​కొనుక్కోవడం కరెక్ట్​ కాదని ఆయన అన్నారు. భగీరథ నీళ్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ అవతరణ ఉత్సవాలపై యాదాద్రి కలెక్టరేట్​లో ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో మంగళవారం నిర్వహించిన రివ్యూలో మంత్రి జగదీశ్ మాట్లాడారు.

వచ్చే నెల 2 నుంచి 22 వరకూ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ‘‘వాన పడడం కూడా ప్రభుత్వం తప్పే అన్నట్టుగా ఆడొకడు ఈడొకడు రోడ్లపై కూర్చుంటున్నరు” అని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వేదికలంటే మామూలు విషయం కాదని, గ్రామ దేవతలతో సమానమని అన్నారు. ఇప్పుడే కాదు భవిష్యత్​లో ఏ కార్యక్రమైనా  రైతు వేదికల్లోనే నిర్వహించాలని ఆదేశించారు.  

ఎస్సారెస్పీ మరిచిపోండి.. అంతా కాళేశ్వరమే

ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని ఎస్సారెస్పీ, మూసీ, కాళేశ్వరంపై ప్రచారం గురించి ఆఫీసర్లు మాట్లాడగా.. మంత్రి జగదీశ్​రెడ్డి అందుకొని ‘‘ఎస్సారెస్పీ గురించి మర్చిపోండి.. ఇప్పుడంతా కాళేశ్వరమే” అంటూ చెప్పుకొచ్చారు.  ఇండ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకే ఇవ్వాలని ఆదేశించారు.