గోటబయ రాజీనామా ప్రసక్తే లేదు

గోటబయ రాజీనామా ప్రసక్తే లేదు
  • ప్రభుత్వ చీఫ్​విప్, మంత్రి ఫెర్నాండో ప్రకటన 
  • స్వల్ప మెజారిటీలో సర్కార్.. ఎమర్జెన్సీ ఎత్తివేత

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగుతారని ప్రభుత్వ చీఫ్​ విప్, మంత్రి జాన్ స్టన్ ఫెర్నాండో ప్రకటించారు. మంగళవారం రాత్రి పార్లమెంటులో అధికార శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్ పీపీ) కూటమి స్వల్ప మెజార్టీ సాధించింది. పార్లమెంటులో 225 మంది సభ్యులు ఉండగా, 150 మంది బలం ఉన్న కూటమి నుంచి 42 మంది ఎంపీలు వైదొలిగారు. దీంతో సర్కారు మైనారిటీలో పడింది. అయితే, మంగళవారం రాత్రి తిరిగి కొందరు ప్రభుత్వానికి మద్దతు తెలపడంతో కూటమి 114 మంది ఎంపీలతో స్వల్ప మెజారిటీ సాధించింది. ఆ వెంటనే ఎమర్జెన్సీ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు ప్రతిపక్ష జనత విముక్తి పెరమునవాస్ (జేవీపీ) కారణమని మంత్రి ఫెర్నాండో ఆరోపించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.

ఆకలి చావులపై స్పీకర్ ఆందోళన 
ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రంగా మారితే ఆకలి చావులు ఖాయమని శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహీంద అబెవర్దన హెచ్చరించారు. అమెరికా ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ మూడీస్ కూడా శ్రీలంక సంక్షోభంపై స్పందించింది. కరోనా పాండెమిక్ నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని చెప్పింది. 

లంకకు ఇండియా పెద్దన్న: రణతుంగ
కష్టాల్లో ఉన్న శ్రీలంక ప్రజలను ఇండియా ఒక పెద్దన్న లాగ ఆదుకుంటోందని మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ అన్నారు. తీవ్రమైన సంక్షోభ సమయంలో శ్రీలంక నేతలు తమకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఉదారంగా సాయం చేశారని కొనియాడారు. లంక ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ను అందించారని చెప్పారు. జాఫ్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పున:ప్రారంభానికి గ్రాంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు.