పంట నష్టం పై జూపల్లి వర్సెస్ హరీష్ రావు

 పంట నష్టం పై జూపల్లి వర్సెస్ హరీష్ రావు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని చింత బాయి తండాలో ఈ నెల 24న  ఎండిపోయిన వరి పొలా లను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్​రావు.. కాంగ్రెస్​లక్ష్యంగా విమర్శలు చేశారు. తాజాగా  మెదక్​లో నిర్వహించిన మీడియా సమావేశంలోనూ అవే వ్యాఖ్యలు రిపీట్​ చేశారు. కాంగ్రెస్​ సర్కారు సాగునీరు , కరెంట్​ ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. 

 హరీశ్​ కామెంట్స్​పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్​అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం హరీశ్​రావు కరువు పరిస్థితులను వాడుకుంటున్నారని, ఎన్ని ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయో చెప్పాల్సింది హరీశ్​రావు కాదని పేర్కొన్నారు. పంట నష్టంపై ఆఫీసర్లు సర్వే చేస్తున్నారని, ఆ రిపోర్ట్​రాగానే పరిహారం అందజేస్తామన్నారు.  బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో ఏనాడూ పంట నష్టపరిహారం చెల్లించని హరీశ్​రావు ఇప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు.

 సాగునీటి సమస్యకు కారణమైన బీఆర్ఎస్ నాయకులే కరువు గురించి  మాట్లాడటం  హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.  కరెంట్​పై హరీశ్  వాస్తవాలు తెలుసుకోవాలని, నిరుడు జనవరితో పోలిస్తే 2024 జనవరి లో 10 నుంచి-20 మిలియన్​ యూనిట్ల వినియోగం పెరిగిందని ఆయనకు తెలియకపోవడం శోచనీయమని చురకలంటించారు.