- మద్యం తయారీలో ఉపయోగించే ఈఎన్‌ఏపై జీఎస్‌టీ మినహాయింపు: జూపల్లి
- కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర చట్టంలో మార్పులని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: జీఎస్‌టీ కౌన్సిల్ 51 నుంచి 55వ సమావేశాల వరకు చేసిన సిఫార్సుల మేరకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలనే ఉద్దేశంతో సవరణలు చేపట్టినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నిబంధనలను మరింత సరళతరం చేస్తూ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తెలంగాణ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లు-2026ను ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది.
సీఎం రేవంత్ రెడ్డి తరఫున జూపల్లి ఈ బిల్లును సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది నవంబరులో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ నూతన బిల్లును తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. జాతీయ విధానానికి అనుగుణంగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన పరిధిలోని ఐజీఎస్‌టీ (ఐజీఎస్టీ), సీజీఎస్‌టీ (సీజీఎస్టీ) చట్టాలను సవరించిందని, దానికి అనుగుణంగా రాష్ట్ర జీఎస్‌టీ చట్టంలో మార్పులు చేయడం తప్పనిసరైందన్నారు.
బిల్లులోని కీలక మార్పులు
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ.. మానవ వినియోగం కోసం తయారు చేసే మద్యం (లిక్కర్)లో వాడే ‘ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్’ (ఈఎన్ఏ)ను జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయించారు. దీని కోసం సెక్షన్ 9ను సవరించామన్నారు. పన్ను ఎగవేత కేసుల విచారణలో మరింత పారదర్శకత కోసం సెక్షన్ 74ఏ ను చేర్చారు. దీనివల్ల సాధారణ తప్పులుగా నమోదైన కేసులను విచారణాధారంగా మోసం కిందకు, అలాగే మోసం కింద ఉన్న కేసులను సాధారణ తప్పుల కిందకు మార్చే వెసులుబాటు కలుగుతుంది.
సఫారీ రిట్రీట్స్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల తలెత్తిన సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు ఈ మార్పు చేశారు. పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల తయారీదారులు పన్ను ఎగవేతకు పాల్పడకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్, నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పంపిణీలో స్పష్టతనిస్తూనే.. మున్సిపల్ ఫండ్, లోకల్ ఫండ్ వంటి నిర్వచనాలను సవరించినట్టు మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
