
వచ్చే దసరా నాటికి ఉప్పల్ ఫ్లై ఓవర్ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జులై 16న ఉదయం ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఉప్పల్ ఫ్లై ఓవర్ పై ప్రత్యేక శ్రద్ధ నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 8 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఉప్పల్ -నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఆర్థిక వణరులు, ఇతర కారణాల వల్ల తీవ్ర జాప్యం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరిపి పనుల్లో వేగం పెంచామని చెప్పారు.
Also Read :వరద జలాలకు శాస్త్రీయ గుర్తింపే లేదు
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మొన్నటి వరకు పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగించామన్నారు. ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వేగాన్ని పెంచి త్వరిత గతిన పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లై ఓవర్ గా పేరున్న ఫ్లై ఓవర్ ఉప్పల్ ఫ్లై ఓవర్ అని అన్నారు. వచ్చే దసరా నాటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఉప్పల్ నుంచి నారాపల్లిలోని సీపీఆర్ ఐ (సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) వరకు రూ.527 కోట్లతో 6.25 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు 2018లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.