వరద జలాలకు శాస్త్రీయ గుర్తింపే లేదు : బనకచర్ల గైడ్ లైన్స్ కు విరుద్దమన్న వెదిరె శ్రీరామ్

వరద జలాలకు శాస్త్రీయ గుర్తింపే లేదు : బనకచర్ల  గైడ్ లైన్స్ కు విరుద్దమన్న వెదిరె శ్రీరామ్

వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం–బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్.. ట్రిబ్యునల్​ అవార్డు, సీడబ్ల్యూసీ గైడ్​లైన్స్​కు పూర్తి విరుద్ధమని వెదిరె శ్రీరామ్​తెలిపారు. వరద జలాలకు శాస్త్రీయమైన గుర్తింపే లేదని చెప్పారు. వరద జలాలనే మాట ఊహాజనితమని తెలిపారు. 50 శాతం డిపెండబిలిటీ ఆధారంగా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులను కడితే.. దిగువ రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే, దిగువ రాష్ట్రాలూ 50 శాతం డిపెండబిలిటీ కింద ప్రాజెక్టులను నిర్మిస్తే.. ఎగువన రాష్ట్రాలకూ నష్టం జరుగుతుందని చెప్పారు. ఇంకా చెప్పాలంటే మొత్తం బేసిన్‌‌‌‌‌‌‌‌లోని రాష్ట్రాలన్నింటికీ నష్టం జరుగుతుందన్నారు.  బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీవ్ర నష్టమని పేర్కొన్నారు. ఏపీ ఆ ప్రాజెక్టు చేపడితే బేసిన్‌‌‌‌‌‌‌‌లోని అన్ని రాష్ట్రాల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని గుర్తుచేశారు. 

ALSO READ | బనకచర్ల కంటే గోదావరి.. కావేరీ లింక్ బెటర్ : జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్

ఎస్సారెస్పీ సహా పలు ప్రాజెక్టులు పూడికతో నిండిపోవడం, మరోవైపు కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మసాగర్‌‌‌‌‌‌‌‌, సమ్మక్కసాగర్‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాజెక్టులను నిర్మాణ దశలో ఉండడంతో.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కేటాయింపుల మేరకు జలాలను వినియోగించుకోవడం లేదని అన్నారు. ప్రస్తుతం ఏపీ జీబీ లింక్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు లేకుండా పోతాయని, నీటి వినియోగానికి ఇబ్బందులు ఏర్పడుతాయని  చెప్పారు. ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌ మార్పులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. బేసిన్‌‌‌‌‌‌‌‌లోని అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. కేటాయింపుల మేరకు అన్ని రాష్ట్రాలు తమ నీటివాటాలను వినియోగించుకున్న తర్వాతే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు. ఆ మిగులు జలాల్లోనూ బేసిన్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రాలకు వాటా ఉంటుందని తెలిపారు.

గోదావరి బేసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సబ్‌‌‌‌‌‌‌‌ బేసిన్లవారీగా, ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ అవార్డులు, రాష్ట్రాలకు చేసిన నికర కేటాయింపులు తదితర అంశాలపై పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టు.. గోదావరి బేసిన్​ రాష్ట్రాలతోపాటు ఏపీకి గుదిబండగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా ఉన్న ట్రిబ్యునల్​ అవార్డులతో పోలిస్తే గోదావరి ట్రిబ్యునల్​ అవార్డు పూర్తిగా భిన్నమైందని చెప్పారు. 

మహారాష్ట్ర, కర్నాటక, ఉమ్మడి ఏపీ, ఉమ్మడి మధ్యప్రదేశ్​, ఒడిశా చేసుకున్న ఒప్పందాలనే ట్రిబ్యునల్ అవార్డుగా బచావ త్​ ట్రిబ్యునల్​  కేటాయించిందని తెలిపారు. అందులో భాగంగానే గోదావరిని 12 సబ్​ బేసిన్లుగా విభజించారని వివరించారు.