- ధాన్యం లేకుండా డబ్బులు స్వాహా
- పీపీసీ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మకై అక్రమాలు
- వారికి సహకరిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు
- నర్సింగాపూర్ సెంటర్లో బయటపడ్డ బాగోతం
- చాలా సెంటర్లు, మిల్లుల్లో ఇదే తరహా అక్రమాలు
- ఈసారైనా కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేనా..?
మంచిర్యాల, వెలుగు : వరి ధాన్యం కొనుగోళ్లలో పీపీసీ నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. వీరికి కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్లు సహకరిస్తున్నారు. అందరూ కలిసి ఫేక్ రైతుల పేరిట క్రాప్ బుకింగ్ చేసి ధాన్యం లేకుండానే డబ్బులు స్వాహా చేస్తున్నారు.
మరికొన్ని సెంటర్లలో లోకల్ రైతుల పేరిట నకిలీ పేర్లు సృష్టించి మహారాష్ట్ర వడ్లను దొంగచాటుగా డంప్ చేస్తున్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో జిల్లాలోని రెండు సెంటర్లలో అక్రమాలు బయటపడటంతో ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
నర్సింగాపూర్సెంటర్లలో ఇలా...
గత రబీ సీజన్లో జైపూర్ మండలం నర్సింగాపూర్ డీసీఎంఎస్ సెంటర్ నిర్వాహకులు, రామారావుపేటలోని ఓ రైస్ మిల్లు యజమాని, మండల వ్యవసాయ అధికారి సహకారంతో అక్రమాలకు పాల్పడ్డారు. జిల్లాలో 740 ఎకరాల్లో 6,322.60 క్వింటాళ్ల ధాన్యం ఎనిమిది మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసినట్టు చూపించి రూ.1.39 కోట్లు కొట్టేసినట్టు విజిలెన్స్ అధికారులు తేల్చారు. అలాగే ట్రాన్స్‌పోర్టు ఖర్చుల కింద ఫేక్ ట్రక్ షీట్లు సృష్టించి మరో రూ.1.90 లక్షలు మింగినట్టు రుజువైంది.
ఆన్లైన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో తప్పుడు వివరాలు ఎంట్రీ చేసి ఈ అక్రమానికి తెరలేపారు. మండల వ్యవసాయ అధికారి తన క్రాప్ బుకింగ్ లాగిన్‌కు ఏకంగా సెంటర్ నిర్వాహకులు, మిల్లర్‌కు అప్పగించి తనవంతు సహకారం అందించడం వ్యవసాయ అధికారుల తీరుకు అద్దం పడుతోంది. ఇందులో భాగస్వాములైన ప్రముఖ ఆగ్రో ఇండస్ట్రీస్ యజమానులు, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారితోపాటు ఎమినిది మంది రైతులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌పై జైపూర్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 30న క్రిమినల్ కేసు నమోదు చేశారు. సదరు మిల్లును బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. చెన్నూర్ మండలం దుగ్నేపల్లి డీసీఎంఎస్ సెంటర్లోనూ ఫేక్ రైతుల పేరిట రూ.కోటికి పైగా అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఇక్కడ కొన్నట్టు.. అక్కడ దించుకున్నట్టు..
జిల్లాలోని చాలా సెంటర్లలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో నకిలీ రైతుల వివరాలను నమోదు చేసి వారి పేరిట ధాన్యం కొనుగోలు చేసినట్టు, నకిలీ ట్రక్ షీట్లు సృష్టించి ఆ వడ్లను రైస్ మిల్లుల్లో దించుకున్నట్టు చూపుతున్నారు. వాస్తవానికి ఇక్కడ వడ్లు కొన్నది లేదు.. మిల్లుల్లో దించుకున్నది లేదు. కానీ ఆ పేరుతో భారీ మొత్తంలో డబ్బులు స్వాహా చేస్తున్నారు. జిల్లాలోని చాలా మిల్లులు సీఎమ్మార్ బకాయిలు పేరుకుపోవడానికి ఈ విధమైన అక్రమాలే కారణమని తెలుస్తోంది.
సంబంధిత అధికారుల తనిఖీల్లో మిల్లుల్లో ఉండాల్సిన వడ్లు లేకపోవడంతో తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తుండడం వల్ల మిల్లర్ల అక్రమాలు మితిమీరుతున్నాయి. గత సీజన్లో హాజీపూర్ మండలంలోని ఓ మిల్లర్ ఫేక్ రైతుల పేరిట వడ్లు దించుకున్నట్టు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు జిల్లాలోని మిగతా మిల్లుల్లో కూడా తనిఖీలు చేపడితే భారీ ఎత్తున అక్రమాలు బయట పడే అవకాశం ఉంది.
ఈసారైనా పకడ్బందీగా జరిగేనా..?
వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి జిల్లావ్యాప్తంగా 302 సెంటర్లు ఓపెన్ చేసి 2.35 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గతంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా ఉండాలంటే పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ అధికారుల క్రాప్ బుకింగ్ డేటాపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా పెట్టాలి. జిల్లా సరిహద్దులోని సెంటర్లు, మిల్లులకు మహారాష్ర్ట నుంచి వడ్లు రాకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
